సొంత దేశంలో ఉండలేక, అమెరికాకు వెళ్ధామనుకున్న శరణార్ధులను అగ్ని ప్రమాదం బలి తీసుకుంది. మెక్సికోలోని సిడెడ్ జారే నగరంలోని శరణార్థి శిబిరంలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 39 మంది శరణార్థులు మరణించినట్లు తెలుస్తోంది. మెక్సికన్ నేషనల్ మైగ్రేషన్ ఇనిస్టిట్యూట్ సిబ్బంది అగ్ని ప్రమాదాన్ని ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో మొత్తం 39 మంది మరణించగా.. 29 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషయమంగా ఉంది. ప్రమాద సమయంలో క్యాంపులో 70 మంది వరకు శరణార్థులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో వెనిజులా దేశానికి చెందిన వారే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రతీ ఏటా తమ దేశాల్లో ఉండలేక మెరుగైన జీవితం కోసం లాటిన్ అమెరికా దేశాల ప్రజలు అమెరికాకు వలస వెళ్తుంటారు. ఇలా వలస వెళ్తున్నవారిలో చాలా మంది చనిపోవడమో, తప్పిపోవడం జరగడం పరిపాటి. నిత్యం గ్యాంగ్ వార్, డ్రగ్స్ మాఫియాలు, అసమర్థ ప్రభుత్వాల వల్ల మెక్సికో, గ్వాటేమాలా, ఎల్ సాల్విడార్, వెనుజులా, హోండూరాస్ వంటి దేశాల్లో ప్రజల జీవితం దుర్భరంగా మారుతోంది. దీంతో మెరుగైన జీవితం కోసం అమెరికా వారికి ఓ ఆశగా కనిపిస్తుంది. దీంతో చాలా మంది ఎలాగైనా అమెరికా వెళ్లాలనే ఉద్దేశంతో మెక్సికో-యూఎస్ బోర్డర్ వద్ద బారులు తీరుతుంటారు. మెక్సికోలోని సిడెడ్ జారే నగరాన్ని, అమెరికా టెక్సాతో స్టాంటన్ ఇంటర్నేషన్ల బ్రిడ్జ్ కలుపుతుంటుంది. ఈ బ్రిడ్జ్ పై నుంచే వేల సంఖ్యలో వలసదారులు అమెరికాలోకి వెళ్తుంటారు. తాజాగా జరిగిన అగ్ని ప్రమాదం కూడా దీనికి దగ్గరగా ఉన్న శరణార్థి శిబిరంలోనే జరిగింది. 2014 నుంచి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన 7661 మంది శరణార్థులు ప్రాణాలు కోల్పోవడమో, కనిపించకుండా పోవడమో జరిగింది.