Apple Smartwatch Saves US Girl Life: యాపిల్ వాచ్ శరీరంలో ఉన్న అసాధారణ పరిస్థితుల్ని గుర్తించి, ఎందరో ప్రాణాలు కాపాడిన సంఘటనల్ని మనం ఇదివరకే చూశాం. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ అమ్మాయి జీవితాన్ని ఇది కాపాడింది. అమెరికాకు చెందిన కిమ్ దుర్కీకి కొన్నాళ్ల క్రితం యాపిల్ వాచ్ కొనుగోలు చేసింది. మే నెలలో ఓరోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో.. ఆమె వాచ్ ఒక అలెర్ట్ పంపింది. బహుశా అలెర్ట్ సెట్టింగ్స్ ఏమైనా మారిపోయాయేమోనని కిమ్ అనుకుంది.
కట్ చేస్తే.. మరుసటి రోజు కూడా ఆ వాచ్ రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాతి రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అవ్వడంతో.. కిమ్ తీవ్ర అసహనానికి గురైంది. తన వాచ్ పాడైందేమోననుకొని, విసిరి కొట్టాలనుకుంది. కానీ, కుటుంబ సభ్యులకు మాత్రం ఏదో అనుమానం వచ్చింది. అన్ని సార్లు అలెర్ట్ పంపింది కాబట్టి, కచ్ఛితంగా ఏదో సమస్య ఉంటుందనుకొని కిమ్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించిన మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు ఓ షాకింగ్ విషయం రివీల్ చేశారు. కిమ్ శరీరంలో మైక్సోమా అనే ప్రమాదమైన కణితి ఏర్పడిందని వెల్లడించారు. ఇది అరుదుగా ఏర్పడుతుంది, వెంటనే ఆపరేషన్ చేసి తొలగించాలని, లేకపోతే హార్ట్ ఎటాక్ వస్తుందని వైద్యులు తెలిపారు.
ఆ రిపోర్ట్ చూసి ఖంగుతిన్న కిమ్ పేరెంట్.. ఆమెకు ఆపరేషన్ చేయించారు. ఐదు గంటలపాటు వైద్యులు శ్రమించి, కిమ్ శరీరం నుంచి ఆ కణితిని తొలగించారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. యాపిల్ వాచ్ ఇచ్చిన అలెర్ట్స్ వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని తెలిపింది. తొలుత అలెర్ట్ వచ్చినప్పుడు డాక్టర్లను సంప్రదిస్తే, ఆందోళన వల్ల ఆ అలెర్ట్ వచ్చి ఉంటుందన్నారని చెప్పింది. కానీ, మరోసారి అలెర్ట్ రావడంతో మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి డాక్టర్లను సంప్రదించామని, వాళ్లు ట్యూమర్ ఉందని గుర్తించి ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్పుకొచ్చింది.