చంద్రులు భూమికి ఉన్న సహజ ఉపగ్రహం. భూమిపై జీవజాలానికి ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తోంది. అందుకే మనం ఉంటున్న భూమిని తల్లిగా.. చంద్రున్ని చందమామగా పిలుస్తుంటాం. భూమి కక్ష్యకు, భూమి స్థిరత్వానికి చంద్రుడు సహకరిస్తుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే భూమిని ఓ టెలివిజన్ అనుకుంటే.. చంద్రుడు ఓ స్టెబిలైజర్ లాంటి వాడు. ఇంతలా భూమికి సహకరిస్తుంటాడు. ఒక వేళ చంద్రుడే లేకపోతే.. మనం ఇప్పుడు నివసిస్తున్న భూమి అనేక ఒడిదొడుకులకు లోనయ్యేది.
చంద్రుడు ఎప్పటి నుంచో అంతుపట్టని రహస్యంగా ఉంటున్నాడు శాస్త్రవేత్తలకు. భవిష్యత్తులో మానవుడు మనుగడ సాగించే గ్రహాల్లో చంద్రుడు, అంగారకుడు మాత్రమే ఉన్నాయి. మానవుల నివాసాలకు సంబంధించి ఈ గ్రహాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే 2025 నాటికి చంద్రుడిపై మొక్కలు పెంచడానికి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్లాంట్ బయాలజిస్ట్ బ్రెట్ విలియమ్స్.. ఇజ్రాయిలీ ప్రైవేట్ మూన్ మిషన్ బెరెషీట్2 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా విత్తనాలను చంద్రుడిపైకి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
చంద్రుడిపై ల్యాండింగ్ తర్వాత సీలు చేసిన ఓ ప్రత్యేకగదిలో మొక్కల పెంపకం జరగనుంది. విపరీత పరిస్థితులను మొక్కలు ఏవిధంగా తట్టుకోగవు, ఎంత త్వరగా మొలకెత్తుతాయనే విషయాలను శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ గడ్డి జాతిని ఇందుకోసం ఎంపిక చేశారు. నీరు లేని పరిస్థితుల్లో కూడా ఇది జీవించగలదు. ఈ ప్రాజెక్టు ఆహారం, ఆక్సిజన్ ఉత్పత్తికి ప్రారంభం దశ అని.. భవిష్యత్తులో మానవుడు చంద్రుడిపై కాలనీలు ఏర్పాటు చేయడానికి కీలకమైనదిగా పరిశోధకులు చెబుతున్నారు. లూనారియా వన్ అన సంస్థ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టులో ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు ఉన్నారు.