ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా.. ఇప్పుడు తగ్గుతున్న జనాభా వృద్ధి రేటులో ఆందోళన చెందుతోంది. శ్రామిక శక్తి తగ్గి.. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే ప్రమాదముందని భయాందోళనకు గురవుతోంది. ఈ క్రమంలోనే జనాభా పెంపు కోసం బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. భారత్‌లో జనాభా పెరుగుతూ ఉండగా.. చైనాలో మాత్రం జనాభా వృద్ధి రేటు తగ్గుతూ వస్తోంది. 2025 నాటికి దేశంలో జనాభా క్రమక్రమంగా తగ్గుతుందనే అంచనాలున్నాయి. ఈ క్రమంలో చైనా అప్రమత్తమైంది. జనాభాను పెంచేందుకు చర్యలు చేపట్టింది. ‘ఒక బిడ్డ విధానాన్ని’ సడలించినప్పటికీ, 2017 నుండి చైనా జననాల రేటు తగ్గుముఖం పట్టింది. ఐనప్పటికీ గత ఐదేళ్లలో జననాల రేటు భారీగా తగ్గింది.
ఈ నేపథ్యంలో ఎక్కువ మంది పిల్లలను కనేలా కుటుంబాలను ప్రోత్సహించే లక్ష్యంతో చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తాజాగా నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. పిల్లలను కనే వారికి సబ్సిడీలు, పన్ను రాయితీలు, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలను కల్పించాలని సూచించింది. జనాభా పెంపు చర్యలపై వ్యయాన్ని పెంచాలని… దేశవ్యాప్తంగా పిల్లల సంరక్షణ సేవలను మెరుగుపరచాలని కేంద్ర, ప్రాంతీయ ప్రభుత్వాలకు జాతీయ ఆరోగ్య కమిషన్ సూచించింది. జనాభా పెంపు చర్యలను క్రియాశీలకంగా అమలు చేయాలని పేర్కొంది.
ఈ చర్యలలో భాగంగా మెరుగైన ప్రసూతి సంరక్షణ సేవలు, పబ్లిక్-బెనిఫిట్ చైల్డ్ కేర్ సేవలు, మెరుగైన ప్రసూతి, తల్లిదండ్రుల సెలవు విధానాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రసూతి భీమా పరిధిలోకి వచ్చే వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. 2021లో ఈ సంఖ్య 240 మిలియన్లకు చేరుకుంది, 2012 కంటే 1.5 రెట్లు ఎక్కువ. 2020లో ఏడవ దేశవ్యాప్త జనాభా గణనలో చైనా ఏటా సగటున 0.53 శాతం వృద్ధిని కనబరిచింది. గత ఏడాది చైనా కొత్త చట్టాన్ని జారీ చేసింది. ఇది చైనీస్ జంటలకు ముగ్గురు పిల్లలను కలిగి ఉండటానికి వీలు కల్పిస్తుంది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా జంటలు అదనపు పిల్లలను కనడానికి ఇష్టపడకపడట్లేదని పలు సర్వేల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. 2020లో దశాబ్దానికి ఒకసారి జరిగే జనాభా గణన తర్వాత మూడో బిడ్డను అనుమతించాలనే నిర్ణయం అమలు చేయబడింది. జనాభా లెక్కల ప్రకారం, 60 ఏళ్లు పైబడిన వారు 18.7 శాతం పెరిగి 264 మిలియన్లకు చేరుకున్నందున చైనా జనాభా సమస్య మరింత తీవ్రమవుతుందని అంచనా వేయబడింది.