చైనాలో కరువు పరిస్థితులు.. అలర్ట్ ప్రకటించిన డ్రాగన్ కంట్రీ.

0
123

డ్రాగన్ కంట్రీ చైనా కరువు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా సిచువాన్ ప్రావిన్స్ తో పాటు నైరుతి చైనాలోని చాలా కౌంటీలు ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్నాయి. దీంతో చైనా మొదటి జాతీయ కరువు హెచ్చరికను జారీ చేసింది. దేశవ్యాప్తంగా ‘‘ ఎల్లో అలర్ట్ ’’ జారీ చేసింది. నైరుతిలోని సిచువాన్ ప్రావిన్స్ నుంచి యాంగ్జీ నది డెల్టాలోని షాంఘై నగరం వరకు భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ప్రపంచ వాతావరణ మార్పులే భారీ ఉష్ణోగ్రతలకు కారణం అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

సెంట్రల్ చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్ లోని యాంగ్జీ నది ముఖ్యమైన వరద బేసిన్ లలో ఒకటైన పోయాంగ్ సరస్సు సాధారణ పరిమాణం కన్నా..నాలుగింట ఒక వంతు కుచించుకుపోయింది. చాగ్ కింగ్ లోని నైరుతి ప్రాంతంలోని 34 కౌంటీల్లో 66 నదులు ఎండిపోయాయని చైనా మీడియా పేర్కొంది. చాంగ్ కింగ్ లో సాధారణంతో పోలిస్తే 60 శాతం మాత్రమే వర్షాలు కురిశాయి. దీంతో ఉష్ణోగ్రతల నుంచి పంటలను రక్షించడంతో పాటు కార్చిచ్చులను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తోంది చైనా ప్రభుత్వం.

చైనా నైరుతి ప్రావిన్సుల్లో 40 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. చాంగ్ కింగ్ ప్రాంతంలో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. ఉష్ణోగ్రత వల్ల సిచువాన్ ప్రావిన్సులో 5.5 మిలియన్ల జనాభా ప్రభావితం అవుతున్నారు. శుక్రవారం అధిక ఉష్ణోగ్రతల కారణంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది చైనా ప్రభుత్వం. ఇదిలా ఉంటే హీట్ వేవ్ కారణంగా చైనా మునుపెన్నడు లేని విధంగా విద్యుత్ కోతలను చవిచూస్తోంది. చాలా ప్రాంతాల్లో పరిశ్రమలకు విద్యుత్ కట్ చేశారు. ఉష్ణోగ్రతల కారణంగా ఏసీల వాడకం పెరగడంతో విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది.

మరోవైపు యూరప్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. కరువు అంచున యూరప్ దేశాలు ఉన్నాయి. బ్రిటన్ తో పాటు పోర్చుగల్, స్పెయిన్ వంటి దేశాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయి నదులు ఎండుకు పోతున్నాయి. బ్రిటన్ లోని ప్రఖ్యాత థేమ్స్ నది ఎండిపోయింది. దీంతో రానున్న కాలంలో యూరప్ కరువు బారిన పడే అవకాశం కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here