యూఎస్ఏ చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన ఉద్రికత్తలను పెంచింది. చైనా హెచ్చిరిస్తున్నా.. వాటన్నింటిని పట్టించుకోకుండా నాన్సీపెలోసీ తైవాన్ లో పర్యటించింది. అందుకు తగ్గట్లుగానే తైవాన్ ప్రభుత్వం నాన్సీ పెలోసీకి సాదరస్వాగతం పలికింది. మరోవైపు చైనా హెచ్చరికలను లెక్కచేయకుండా నాన్సీ పెలోసీ పర్యటించడంపై డ్రాగన్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం నాన్సీ పెలోసీ తైవాన్ వదిలి వెళ్లినా ఉద్రిక్తతలు తగ్గడం లేదు. తైవాన్ లక్ష్యంగా చైనా భారీ సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది. తైవాన్ రక్షణ గగనతలంలోకి పీఎల్ఏ ఎయిర్ క్రాఫ్టులు ప్రవేశించి ఉద్రిక్త వాతావారణాన్ని మరింతగా పెంచాయి. ఇదిలా ఉంటే చైనా దశాబ్ధ కాలంలో ఎప్పుడూ లేని విధంగా తైవాన్ సముద్ర జలాల్లో క్షిపణి ప్రయోగాలను నిర్వహించింది.
డాంగ్ ఫెంగ్ బాలిస్టిక్ క్షిపణులను గురువారం తైవాన్ కు ఉత్తర, తూర్పు, దక్షిణ జలాల్లోకి క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వాయువ్య ద్వీపమైన మాట్సు, డోంగ్యిన్, పశ్చిమాన వుకియు సమీపం నుంచి రాకెట్లను పంపినట్లు తైవాన్ ధ్రువీకరించింది. అమెరికా, నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనలో చైనా సార్వభౌమాధికారాన్ని ధిక్కరించిందని చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనికి ప్రతిచర్యలు ఖచ్చితంగా ఉంటాయని హెచ్చరిస్తోంది. గురువారం మధ్యాహ్నం తైవాన్ సమీపంలో ప్రారంభమైన చైనా సైనిక విన్యాసాలు మరో 72 గంటల పాటు కొనసాగనున్నాయి. బుధవారం చైనా ఆర్మీకి సంబంధించిన 27 యుద్దవిమానాలు.. తైవాన్ గగనతలాన్ని ఉల్లంఘించాయి.
ఇదిలా ఉంటే చైనా ప్రయోగించిన క్షిపణులు జపాన్ ప్రత్యేక ఆర్థిక జోన్ లోని జలాల్లోకి ప్రవేశించినట్లు జపాన్ రక్షణ మంత్రి గురువారం తెలిపారు. చైనా ప్రయోగించిన 11 మిసైళ్లలో ఐదు జపాన్ సమీపంలోని జలాల్లోకి ప్రవేశించినట్లు జపాన్ చెబుతోంది. ఈ ఘటనపై జపాన్ చైనాకు నిరసన వ్యక్తం చేసింది. ఈ ఐదు క్షిపణులు ఒకినావా హటెరుమా ద్వీపానికి నైరుతి దిశలో పడ్డట్లు జపాన్ గుర్తించింది.