శ్రీలంకకు చైనా నిఘా నౌక.. భారత్ హెచ్చరికలు శ్రీలంక బేఖాతరు

0
145

చైనాకు చెందిన గూఢచారి నౌక శ్రీలంకలోని హంబన్‌టోటా నౌకాశ్రయానికి మంగళవారం చేరుకుంది. ఈ గూఢచారి నౌక రాకపై భారత్ భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేసిన కొద్ది రోజుల్లోనే శ్రీలంకలోని పోర్టుకు చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నౌకకు ఉపగ్రహాలు, ఖండాంతర క్షిపణులను ట్రాక్‌ చేయగల సామర్థ్యం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చైనా నౌక వాంగ్ యాంగ్ 5 ఉదయం 8.30 గంటలకు శ్రీలంక నౌకాశ్రయానికి చేరుకుందని హార్బర్ మాస్టర్ కెప్టెన్ నిర్మల్ డి సిల్వా తెలిపారు.

భారత్‌కు చెందిన వ్యవస్థలపై నిఘావేసే ప్రమాదం ఉందని రక్షణ శాఖ పేర్కొంది. భారతదేశం ఆందోళనల మధ్య ఈ స్పై షిప్ రాకను వాయిదా వేయాలని చైనాను శ్రీలంక గతంలో కోరింది. కానీ చైనా ఒత్తిడికి తలొగ్గి శ్రీలంక శనివారం అనుమతులు జారీ చేసింది. ఆగస్టు 16 నుంచి 22 మధ్య నౌక తమ పోర్టులో ఉండేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఓడ శ్రీలంక జలాల్లో ఉన్నప్పుడు దాని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ స్విచ్ ఆన్‌లో ఉంచుకోవాలనే షరతుపై ఓడరేవు వద్ద ఉంచడానికి అనుమతించబడిందని శ్రీలంక వెల్లడించింది. లంక జలాల్లో ఎటువంటి సర్వేలు నిర్వహించడానికి అనుమతించమని అధికారులు పేర్కొన్నారు.

ఆగస్టు 16-22 మధ్యలో కేవలం ఇంధనం నింపుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. ‘యవాన్‌ వాంగ్‌-5 విషయంలో మా పొరుగు దేశాలతో భద్రత, సహకారం తమ అత్యున్నత ప్రాధాన్యం ఇస్తాము. ప్రతి దేశం సార్వభౌమత్వం సమానమే అనే సూత్రానికి అనుగుణంగా అన్ని పక్షాల ప్రయోజనాలు, ఆందోళనను పరిగణనలోకి తీసుకొంటాము’ అని శ్రీలంక విదేశాంగశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

శ్రీలంకపై ఒత్తిడి పెంచేందుకు భద్రతాపరమైన అంశాలను లేవనెత్తటం పూర్తిగా అసంబద్ధమని చైనా పేర్కొంది. చైనా సముద్ర శాస్త్ర పరిశోధన కార్యకలాపాలను హేతుబద్ధమైన కోణంలో చూడాలని, చైనా, శ్రీలంక మధ్య సహకారానికి అంతరాయం కలిగించకుండా ఆపాలని సంబంధిత పక్షాలను కోరుతున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు. హంబన్‌టొట అభివృద్ధికి చైనా 1.2 బిలియన్‌ డాలర్ల రుణాన్ని ఇచ్చింది. శ్రీలంక ఆ రుణం చెల్లించలేకపోవడంతో ఈ పోర్టును 99 సంవత్సరాల లీజుకు బీజింగ్‌ తీసుకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here