ట్విట్టర్, మెటా బాటలో గూగుల్..10 వేల మందికి ఉద్వాసన

0
36

ఐటీ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయింది. వరసగా ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మెటా, అమెజాన్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు స్పష్టం చేశాయి. అయితే ఇప్పుడు అదే బాటలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా చేరబోతోందని తెలుస్తోంది. వచ్చే ఏడాది గూగుల్ కూడా తన ఉద్యోగులను తొలగిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

తన తోటి టెక్ కంపెనీలు చేపడుతున్న చర్యలనే గూగుల్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. టెక్ న్యూస్ పోర్టల్ ది ఇన్ఫర్మేషన్ ప్రకారం.. సంస్థలో పనిచేస్తున్న 6 శాతం లేదా 10,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు సమాచారం. అంచనాల కన్నా తక్కువ పనితీరును కనబరుస్తున్న ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆ సంస్థ అంతర్గత వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల పనితీరు, ర్యాకింగ్స్ కు సంబంధించిన నివేదిక సిద్ధం చేయాలని టీమ్ మేనేజర్లను కోరినట్లు తెలిసింది. 2023 ప్రారంభంలో ఉద్యోగుల తొలగింపు ప్రారంభం అవుతుందని సమాచారం. అంటే గూగుల్ ఉద్యోగుల తొలగింపుకు మరికొన్ని వారాలే ఉందని తెలుస్తోంది. అయితే గూగుల్, ఆల్ఫాబెట్ కానీ తొలగింపుల ప్రణాళికలను నిర్థారించలేదు.

అయితే గతంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా తొలగింపులపై పరోక్షంగా సూచనలు చేశారు. తక్కువ వనరులు ఉన్నప్పుడే.. ఉద్యోగుల ప్రొడక్టివిటీ బయటపడుతుందని.. గూగుల్ దీన్నే విశ్వసిస్తుందని గతంలో వ్యాఖ్యానించారు. పలు టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నప్పటికీ.. గూగుల్ మాత్రం ఎలాంటి ఉద్వాసన చర్యలు చేపట్టలేదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, బయట నుంచి వస్తున్న ఒత్తిళ్ల వల్ల, ఉద్యోగులు ఉత్పాదకత మెరుగుపడటానికి ఉద్యోగులను తీసేస్తారని సమాచారం. వచ్చే ఏడాది కొత్త పనితీరు వ్యవస్థను ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఇప్పటికే ట్విట్టర్ 50 శాతం అంటే 3800 మంది ఉద్యోగులను తొలగించింది. ఇదే బాటలో ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా కూడా ఏకంగా 13 శాతం అంటే 11,000 ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. ఇక అమెజాన్ కూడా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే బాటలో స్ట్రీమింగ్ దిగ్గజాలు నెట్ ఫ్లిక్స్, డిస్నీ కూడా చేరాయి. ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ద్రవ్యోల్భణం కంపెనీల ఆదాాయంపై ప్రభావం చూపిస్తున్నాయి. దీంతోనే ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశ్యంతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here