గూగుల్ పొదుపు మంత్రం.. ఉద్యోగుల “ఉచితాలకు” స్వస్తి..

0
87

ఆర్థిక మాంద్యం భయాలు, ఇతర కారణాలతో పలు ఐటీ దిగ్గజ కంపెనీలు ఖర్చలను తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. చాలా కంపెనీలు కొత్తగా ఉద్యోగ రిక్రూట్మెంట్లను నిలిపివేశాయి. పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించిన కంపెనీల్లో గూగుల్ కూడా ఉంది. ఇదిలా ఉంటే మరింత పొదుపు చర్యలు చేపట్టింది గూగుల్. తన ఉద్యోగులకు ఇచ్చే ఇతరత్రా సదుపాయాలను తొలగించనుంది. ఉద్యోగులకు ఇస్తున్న ఈ ప్రోత్సహకాలు కంపెనీకి భారంగా మారాయి. దీంతో వీటిని తగ్గించి పొదుపు చేయాలని గూగుల్ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఫ్రీ స్నాక్స్, లాండ్రీ సర్వీసెస్, మసాజ్, ఉద్యోగులకు లంచ్ అందించే మైక్రో కిచెన్ సదుపాయాల్ని కంపెనీ తగ్గించడం లేదా పూర్తిగా తొలగించేందుకు సిద్ధం అయింది. దీంతో పాటు కొత్త నియామకాల ప్రక్రియను కూడా కంపెనీ నిలిపేసింది.

ఉచితంగా స్నాక్స్, లంచ్ ఇతరత్రా సేవలకు గూగుల్ ప్రసిద్ధి. అయితే ఇప్పుడన్నీ కూడా గతం కానున్నాయి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సహా ఎక్కువ ప్రాధాన్యత ఉన్న వాటికి కంపెనీ ఇన్వెస్ట్ చేస్తోంది. దీంతో ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కంపెనీ ఉద్యోగుల్లో 6 శాతం అంటే 12,000 మంది ఉద్యోగులను తొలిగిస్తున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ ఈ ఏడాది ప్రారంభంలో చెప్పారు. గూగుల్ మాత్రమే కాదు ఇతర కంపెనీలు కూడా తమ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. మొదటగా ఉద్యోగులను తొలగించి ఖర్చులను అదుపులోకి తీసుకురావాలని అనుకున్నాయి. దీంతోనే దిగ్గజ ఐటీ కంపెనీలు అయిన అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్ ఇలా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తొలగించాయి. ఆర్థికమాంద్యం భయాలు, కంపెనీల ఆదాయం తగ్గడంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here