లాటిన్ అమెరికా దేశం మెక్సికో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఇటీవల కాలంలో ఆ దేశంలో కాల్పుల ఘటనలు తరుచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దక్షిణ మెక్సికోలోని శాన్ మిగ్యుల్ టోటోలాపాస్ నగరంపై ముష్కరులు దాడి చేశారు. ఈ ఘటనలో మేయర్ తో సహా 18 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మెక్సికన్ మేయర్ కన్రాడో మెన్డోజా సిటీ హాల్ లో ఉన్న సమయంలో తుపాకులతో విరుచుకుపడ్డారు దుండగులు. మేయర్ తో పాటు ఆయన తండ్రి మాజీ మేయర్ జువాన్ మెన్డోజా కూడా మరణించారు. నగరానికి చెందిన పలువురు అధికారులు కూడా ఈ ఘటనలో మరణించారు.
క్రిమినల్ గ్యాంగ్ ‘‘ లాస్ టెక్విలెరోస్’ ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు వీడియో విడుదల చేసింది. అయితే స్థానిక అధికారులు మాత్రం దీన్ని ఇంకా ధృవీకరించలేదు. ఈ భయంకర కాల్పుల ఘటనలో పోలీస్ అధికారులు, కౌన్సిల్ సభ్యులు మరణించారు. గెరెరో రాష్ట్రంలోని శాన్ మిగ్యుల్ టోటోలాపాస్ సిటీ హాల్ ముందు గోడలపై వందలాది తుపాకీ బుల్లెట్ల రంధ్రాలు ఏర్పడ్డాయి. సిటీ హాల్ మొత్తం మృతదేహాలు, రక్తంతో తడిసిపోయింది. దాడి తర్వాత భద్రతా బలగాలు నగరంలోకి ప్రవేశించకుండా వాహనాలతో హైవేను బ్లాక్ చేసింది క్రిమినల్ గ్యాంగ్.
ఇటీవల కాలంలో మెక్సికో దాడులు పెరిగాయి. తాజాగా ఇది మూడో దారుణ ఘటన. అంతకుముందు సెప్టెంబర్ నెలలో సెంట్రల్ మెక్సికన్ రాష్ట్రమైన గ్వానాజువాటోలోని ఓ బార్ లో కాల్పులు జరగడంతో పది మంది మరణించారు. దీని తర్వాత ఉత్తర మెక్సికోలో మరో దాడి జరిగింది. మెక్సికోలో డ్రగ్స్ నిరోధానికి ప్రభుత్వం వ్యతిరేక ఆపరేషన్లు ప్రారంభించినప్పటి నుంచి అక్కడ పలు డ్రగ్స్ మాఫియా గ్రూపుల కాల్పులకు తెగబడుతున్నాయి. రాజకీయ నాయకులు, పోలీసులు, సైనికులే టార్గెట్ గా దాడులు చేస్తున్నారు. 2006లో డిసెంబర్ లో ప్రారంభం నుంచి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మెక్సికోలో 3,40,000 కన్నా ఎక్కువ హత్యలు జరిగాయి.