లింగ సమానత్వ సూచిలో ఇండియా చివరి వరసలో నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2022 నివేదిక ప్రకారం మనకన్నా మన పొరుగు దేశాలు మెరుగైన పనితీరును కనబరిచాయి. మొత్తం 146 దేశాల్లో ఇండియా 135వ స్థానంలో నిలిచింది. మన తర్వాత 11 దేశాలు మాత్రమే ఉన్నాయి. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, కాంగో, ఇరాన్, చాద్ దేశాలు చివరి ఐదు స్థానాల్లో ఉన్నాయి. పొరుగు దేశాలతో పోలిస్తే ఇండియా చాలా వెనబడి ఉంది. బంగ్లాదేశ్ (71), నేపాల్ (96), శ్రీలంక(110), మాల్దీవులు (117), భూటాన్ (126)లు మన కన్నా మెరుగైన ఫలితాలను కనబడరిచాయి.
2021 ఏడాదిలో 156 దేశాల్లో ఇండియా 140వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 4 అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశం, విద్యా సాధన, ఆరోగ్యం- మనుగడ, రాజకీయ సాధికారత అంశాల ఆధారంగా సున్నా నుంచి 100 వరకు స్కోర్ ఇస్తారు. ఆర్థిక భాగస్వామ్య- అవకాశాల్లో 143వ స్థానంలో, విద్యా సాధనలో 107వ స్థానంలో, రాజకీయ సాధికారతలో 48వ స్థానంలో నిలిచింది. ‘ ఆరోగ్యం- మనుగడ’ సూచిలో ఇండియా అట్టడుగున 146వ స్థానంలో నిలిచింది. ప్రస్తుత రిపోర్ట్ ప్రకారం మనం లింగ సమానత్వం సాధించాలంటే మరో 132 ఏళ్లు పడుతుందని నివేదిక పేర్కొంది.
జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2022 ప్రకారం టాప్ టెన్ దేశాల్లో వరసగా ఐస్ లాండ్, ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్, రువాండా, నికరాగ్వా, నమీబియా, ఐర్లాండ్, జర్మనీ ఉన్నాయి. జెండర్ గ్యాప్ ఇండెక్స్ లో ఐస్ లాండ్ 90 కన్నా ఎక్కువ స్కోర్ చేసి ప్రథమ స్థానంలో నిలిచింది.