పాకిస్తాన్ లో సిక్కు మహిళ కిడ్నాప్, మతమార్పిడిపై భారత్ ఆగ్రహం

0
161

ఏ అంతర్జాతీయ వేదికపైన కూడా పాకిస్తాన్ కేవలం భారత వ్యతిరేక మాటలే చెబుతోంది. కాశ్మీర్ లో మైనారిటీల హక్కుల గురించి మాట్లాడే దాయాది దేశం తన దేశంలో మైనారిటీలైన హిందువులు, సిక్కులు, క్రైస్తవుల హక్కులను పట్టించుకోవడం లేదు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ పలు ప్రావిన్సుల్లో మైనారిటీకి చెందిన మహిళలు, బాలికను కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మార్చారు.

ఈ ఘటనలపై భారత్, పాకిస్తాన్ కు స్ట్రాంగ్ మెసేజ్ పంపింది. మైనారిటీల భద్రతకు పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆగస్టు 20 పాకిస్తాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో ఓ సిక్కు మహిళా టీచర్ ని కిడ్నాప్ చేసి బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చారు. ఈ ఘటనను భారత ప్రభుత్వం పాక్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇటువంటి దిగ్భ్రాంతికరమైన, నీచమైన సంఘటనల పట్ల కేంద్ర తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుందని అన్నారు. పాకిస్తాన్ నిజాయితీగా విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కోరారు. మైనారిటీల భద్రత, హక్కులపై పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని జైశంకర్ అన్నారు.

ఖైబర్ ప్రావిన్సులో బునెర్ జిల్లాలో సిక్కు మహిళా ఉపాధ్యాయురాలికి తుపాకీ గురిపెట్టి కిడ్నాప్ చేశారు. ఆ తరువాత ఆమెకు బలవంతంగా పెళ్లి చేసి ఇస్లాం మతంలోకి మార్చారు. ఈ ఘటనపై ఎన్సీఎం చీఫ్ ఇక్బాల్ సింగ్ లాల్ పురా విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. పాకిస్తాన్ లో సిక్కుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గమనిస్తోందని.. దౌత్యమార్గాల ద్వారా పాకిస్తాన్ కు ఈ విషయాన్ని లేవనెత్తుతామని జైశంకర్ అన్నారు.

ఇదిలా ఉంటే ఈ ఘటన జరిగిన తర్వాత సింధు ప్రావిన్సులో ఇద్దరు బాలికను, ఓ పెళ్లయిన హిందూ యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మీనా మోఘవాల్ అనే 14 ఏళ్ల బాలికను నాసర్ పూర్ ఏరియాలో, మీర్ పూర్ ఖాస్ పట్టణంలో మరో హిందూ బాలిక మార్కెట్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో కిడ్నాప్ చేశారు. వీరిని బలవంతంగా కిడ్నాప్ చేసి ముస్లిం వ్యక్తులతో వివాహం జరిపించారు. బలవంతంగా మతాన్ని మార్చారు. మరో కేసులో ముగ్గురు పిల్లలు ఉన్న హిందూ యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకుని మతం మార్చారు. ఈ ఘటనలో బాధిత యువతి భర్త రవి కుమార్ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. వీరి ఇంటి పక్కన ఉండే అహ్మద్ చాంధీయో అనే వ్యక్తి తన భార్యను వేధించి, కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here