4 నెలల్లో మూడుసార్లు ఉద్యోగం ఔట్.. ఐటీ ఉద్యోగి ఆవేదన

0
380

చాలా మందికి ఐటీ, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఓ కల. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉందంటే లక్షల్లో జీతాలు, కార్ల, బంగ్లాలు అనే ఉద్దేశం సామాన్య ప్రజల్లో నాటుకుపోయింది. అయితే ఆ మత్తు దిగిపోతోంది ఇప్పుడు. నిర్ధయగా కంపెనీలు తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో టాప్ టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. టెక్ దిగ్గజ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్ ఇలా పలు కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించేశాయి. కొత్త పాత అనే సంబంధం లేకుండా ఏడాపెడా ఉద్యోగులను ఊడబీకింది. 2022లో ఉద్యోగుల లేఆఫ్ లు ప్రారంభం కాగా.. 2023లో కొనసాగుతున్నాయి. దాదాపుగా 90 ఇతర టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 50,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి.

ఇదిలా ఉండగా.. ఓ టెక్కీ ఆవేదన ఇప్పుడు వైరల్ గా మారింది. 4 నెలల్లో 3 సంస్థలు సదరు ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత కొత్త కంపెనీలో చేరినా.. ఉద్యోగానికి భద్రత లేదు. మళ్లీ ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది. తాజాగా ఓ ఉద్యోగి గూగుల్ నుంచి తొలగించబడ్డాడు. అంతకుముందు నవంబర్ లో అమెజాన్ నుంచి, సెప్టెంబర్ లో స్నాప్ నుంచి తొలగించబడ్డాడు. ‘‘నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియదు.. కొత్తగా ఉపాధిని కనుక్కోవాల్సి ఉంది. ఏదైనా టెక్ కంపెనీ నియామకాలు చేస్తుందా..? నేను కొన్ని నెలలు సెలవు తీసుకుని వేసవిలో మళ్లీ ప్రయత్నించాలా..? స్టార్ట్ ఆప్ ప్రారంభించాలా..?’’ అంటూ బ్లైండ్ లో రాసుకొచ్చాడు.

గూగుల్ ఇటీవల 12,000 మందిని, అమెజాన్ 18,000 మందిని, మైక్రోసాఫ్ట్ 10,000 మందిని, మెటా 11,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ట్విట్టర్ 50 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. దీంతో పాటు పలు స్టార్టప్స్, ఇతర కంపెనీలు కూడా ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో తమ సిబ్బందిని తొలగిస్తున్నాయి. ఇండియాలో విప్రో కంపెనీ కూడా 400 మంది ప్రెషర్లను ఉద్యోగాల నుంచి తొలగించింది. రాబోయే రోజుల్లో పలు ఇతర భారత ఐటీ కంపెనీలు కూడా లేఆఫ్స్ ప్రకటిస్తాయనే వార్తలు ఐటీ ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here