బ్రిటన్ ప్రధాని రేసులో పోటీ పడుతున్న రిషీ సునాక్, లిజ్ ట్రస్‌ల మధ్య పోరు దాదాపు తుది దశకు చేరుకుంది. బోరిస్ జాన్సన్ వారసులెవరో కొద్ది రోజుల్లో తేలిపోనుంది. వచ్చే వారం నుంచి పార్టీ ఓటర్లకు బ్యాలెట్ పత్రాలు కూడా పంపిణీ కానున్నాయి. కానీ బ్రిటన్‌కు చెందిన స్థానిక బెట్టింగ్ సంస్థ స్మార్కెట్స్ మాత్రం తదుపరి ప్రధాని లిజ్ ట్రస్ కావడం దాదాపు ఖాయం అని అంచనా వేస్తోంది. టోరీ పార్టీ సభ్యుల్లో ఎక్కువ మంది ఆమెకే మద్దతుగా నిలుస్తారని పేర్కొంది. అయితే తదుపరి ప్రధానిగా సునాక్ కంటే లిజ్ ట్రస్‌కు అవకాశాలు గణనీయంగా ఉన్నాయని తెలుస్తోంది. రిషి సునాక్‌కు 10 శాతం మాత్రమే ఛాన్స్ ఉందని.. ఈ పోటీలో గెలుపు 90శాతం ఆమెనే వరించే అవకాశాలున్నాయని స్థానిక బెట్టింగ్ ఎక్స్ఛేంజ్ సంస్థ స్మార్కెట్స్ అంచనా వేసింది.
ప్రధాని రేసులో వీరిద్దరూ మిగిలినప్పుడూ విజయావకాశాలు లిజ్ ట్రస్, రిషి సునాక్‌కు వరుసగా 60-40 శాతంగా ఉన్నాయి. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆమెకు అనుకూలంగా మారుతూ వచ్చాయి. పోటీ మొదలైనప్పటి నుంచి రిషి సునాక్ గెలుస్తారని చాలా మంది అంచనా వేశారు. అనంతరం డిబేట్లలో ట్రస్ ప్రసంగాలు ఈ అంచనాలను అధిగమించాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ట్రస్‌కు 90శాతం విజయావకాశాలు ఉండగా.. సునాక్ గెలుపు అవకాశాలు 10శాతానికి తగ్గాయని అని స్మార్కెట్స్ పొలిటికల్ మార్కెట్స్ హెడ్ మాథ్యూ షాడిక్ తెలిపారు. అయితే రేసులో తాను వెనుకబడి ఉన్నాననే విషయాన్ని రిషి సునాక్ అంగీకరించారు. అయినప్పటికీ చివరి వరకు పోరాడుతానని, ప్రతి ఓటు కోసం ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. బ్రిటన్ కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు 1.75లక్షల మంది టోరీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 5న నూతన ప్రధాని ఎవరో అధికారికంగా ప్రకటిస్తారు.
పలు వివాదాల్లో కూరుకుపోయిన బోరిస్ జాన్సన్ ఈ నెల 7వ తేదీని ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు అధికార కన్జర్వేటివ్ పార్టీ ప్రక్రియ చేపట్టింది. పార్టీ అధ్యక్ష పదవికి, తద్వారా ప్రధాని పదవికి ఎన్నిక మొదలవ్వగా.. ఇందుకోసం తొలుత 11 మంది పోటీ పడ్డారు. అనేక రౌండ్ల అనంతరం తుది రేసులో మాజీ ఆర్థిక మంత్రి సునాక్, మాజీ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ నిలిచారు.