ఆఫ్రికాలోని మొరాకో-స్పెయిన్ దేశాల సరిహద్దుల్లో తొక్కిసలాట జరిగింది. సరిహద్దు కంచెను కత్తిరించడానికి వలసదారులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు కంచె వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో 18 మంది చనిపోయారు. 2వేల మందికి పైగా వలసదారులు ఒక్కసారిగా కంచెను దాటేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగి పలువురు మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
మొరాకో సరిహద్దు నుంచి స్పెయిన్ వేరుచేసే కంచెను కత్తిరించడానికి వలసదారులు ప్రయత్నించారని స్పెయిన్ భద్రతా అధికారులు వెల్లడించారు. అప్రమత్తమై వారిని అదుపుచేశామని.. చాలా మంది వెనక్కి తగ్గారన్నారు. కానీ 130 మంది మాత్రం ఒక్కసారిగా కంచె వద్దకు దూసుకొచ్చారని అధికారులు వెల్లడించారు.
అంతకుముందు ఐదుగురు వలసదారులు మరణించారని పేర్కొనగా.. ఆస్పత్రికి తరలించిన అనంతరం ఈ సంఖ్య 18కు చేరింది. ఈ ప్రమాదంలో 75 మందికి పైగా గాయాలైనట్లు తెలిపింది. 140 మంది మొరాకో భద్రతా సిబ్బంది గాయపడ్డారని.. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మీడియా చెప్పింది.