కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. లివర్, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే లాంగ్యా హెనిపావైరస్ అనే కొత్త జూనోటిక్ వైరస్‌ను చైనా గుర్తించింది. ఈ కొత్త వైరస్ ఇప్పటికే 35 మందికి సోకినట్లు సైంటిస్టులు గుర్తించారు. లాంగ్యా వైరస్ జంతువుల నుంచి మనుషులకు ఇది వ్యాపించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొత్త వైరస్ ఇప్పటివరకు ఒకరి నుంచి మరొకరికి సోకిందనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని, మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయని, అప్పటివరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు. జ్వరం, అలసట, దగ్గు, కండరాల నొప్పి, ఆకలి లేకపోవడం, తలనొప్పి, వాంతులు ఈ వైరస్ లక్షణాలు. తూర్పు చైనాలో అనారోగ్యం పాలైన కొందరి నమూనాలు పరిశీలించగా కొత్త లాంగ్యా హెనిపావైరస్ (LayV) గుర్తించబడిందని ఓ అధ్యయనం తెలిపింది.
చైనాలోని షాన్‌డాంగ్, హెనాన్ ప్రావిన్స్‌లలో లాంగ్యా వైరస్ సోకిన 35 మంది రోగులను గుర్తించారు. వీరిలో 26 మందిలో జ్వరం, అలసట, దగ్గు, కండరాల నొప్పి, ఆకలి లేకపోవడం, తలనొప్పి, వాంతులు లక్షణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వారు సన్నిహితంగా ఉన్నవారిలో ఈ లక్షణాలు లేవని.. అంటే మనిషి నుంచి మనిషికి వ్యాప్తి మెల్లగా ఉండొచ్చని సూచిస్తుందన్నారు. 15 మంది బాధిత కుటుంబసభ్యులను పరీక్షించగా 9 మందికి అసలేం లక్షణాలు లేవి అధ్యయనంలో తేలింది. అయినా దీనిని నిర్ధారించడానికి పరిశోధనలు చేయాలని పరిశోధకులు వెల్లడించారు. ఈ వైరస్ కరోనా కంటే చాలా ప్రమాదకరమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం హెనిపా వైరస్‌కు వ్యాక్సిన్, చికిత్స లేదు. స్వీయ రక్షణ మాత్రమే చికిత్స. లాంగ్యా హెనిపావైరస్ కేసులు ఇప్పటివరకు ప్రాణాంతకం, చాలా తీవ్రమైనవి కావు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని డ్యూక్-ఎన్‌యుఎస్ మెడికల్ స్కూల్‌లోని ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రోగ్రామ్‌లో ప్రొఫెసర్ వాంగ్ లిన్ఫా గ్లోబల్ టైమ్స్‌తో పేర్కొన్నారు.