తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది పాకిస్తాన్. ఐఎంఎఫ్ 1.1 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీని ఇస్తే తప్పా పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే అక్కడ ఆహార సంక్షోభం నెలకొంది. నిత్యావసరాల ధరలు పెరిగాయి. ఒక వేళ ధరలు పెరిగినా కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్న తగినంత సరకులు అందుబాటులో ఉండటం లేదు. గోధుమ పిండితో పాటు వంటనూనె, చక్కెర ఇలా పలు నిత్యావసరాల కొరత వేధిస్తోంది.
ఇదిలా ఉంటే ఆర్థిక సంక్షభం నుంచి బయటపడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం పొదుపు చర్యలు పాటిస్తోంది. ఇప్పటికే ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గి పన్నులు పెంచుతోంది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులు పెంచడంతో పాటు పెట్రోల్, కరెంట్ ధరలను పెంచింది. ఇక ఉద్యోగుల జీతభత్యాలను తగ్గించింది. అలవెన్సులను కట్ చేసింది. ఇక పాకిస్తాన్ ఆర్మీకి రేషన్ పై తిండిపెడుతున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది.
Read Also: <a href=”https://ntvtelugu.com/sports/sunil-gavaskar-wants-to-comments-ks-bharath-332508.html”>KS Bharath: కేఎస్ భరత్ వద్దు.. అతడే సరైనోడు.. టీమిండియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు</a>
అయితే ఇటీవల పొదుపు చర్యల్లో భాగంగా షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మంత్రులు, క్యాబినెట్ సభ్యులు, ఇతర అధికారులు లగ్జరీ కార్లను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది అయితే పొదుపు చర్యలను ప్రకటించినప్పటికీ చాలా మంది సీనియర్ అధికారుల, మంత్రులు ఎస్ యూ వీ, సెడాన్ కార్లను వాడుతున్నారని అక్కడి వార్త సంస్థ డాన్ పేర్కొంది. పొదుపు చర్యల అమలుపై పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పాక్ మంత్రులు తమ లగ్జరీ కార్లను తిరిగి ఇచ్చేందుకు ఇష్టపడటం లేదని తెలిపింది. 30 లగ్జరీ వాహనాల్లో 14 మంది మంత్రులు మాత్రమే కార్లను తిరిగి ఇచ్చారు. 16 కార్లు ఇప్పటికీ మంత్రుల వద్దే ఉన్నాయి. అయితే మూడు రోజుల్లో మిగిలిన కార్లను తిరిగి ఇచ్చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు భద్రతా వాహనాల వినియోగాన్ని ఉపసంహరించుకోవాలని కూడా చర్చించినట్లు సమాచారం. పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు 15 శాతం ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు జీతాలు, అలవెన్సులు, లగ్జరీ కార్లు, విదేశీ పర్యటనలు, బిజినెస్ క్లాస్ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం.