యూకే ప్రధానిగా లిజ్ ట్రస్‌ను నియమించిన క్వీన్ ఎలిజబెత్

0
175

యూకే కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ పదవీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం వెల్లడైన తుది ఫలితాల్లో రిషి సునక్‌పై గెలుపొందిన లిజ్ ట్రస్.. యూకేకు ప్రధానిగా ఎన్నికయ్యారు. తాజాగా యూకే ప్రధానిగా లిజ్ ట్రస్‌ను క్వీన్ ఎలిజబెత్ నియమించారు. ఇన్నాళ్లు ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ రాజీనామాను రాణి ఆమోదించారు. క్వీన్ ఎలిజబెల్ 2 అధికారికంగా లిజ్ ట్రస్‌ను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. లిజ్ ట్రస్ మంగళవారం మధ్యాహ్నం స్కాట్లాండ్ లోని బల్మోరల్ కాజిల్‌లో పదవీ బాధ్యతలను స్వీకరించారు. 70 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్ పాలనలో లండన్ లోని బకింగ్ హామ్ ప్యాలెస్‌లో కాకుండా బాల్మోరల్‌లో అధికారం చేపట్టడం ఇదే తొలిసారి.47 ఏళ్ల లిజ్ ట్రస్ యూకేకు కాబోతున్న మూడో మహిళా ప్రధాని. అంతకు ముందు మార్గరేట్ థాచర్, థెరిస్సామే మాత్రమే ప్రధానులుగా పదవీ బాధ్యతలను చేపట్టారు.

సోమవారం ప్రకటించిన తుది ఫలితాల్లో టోరీ నాయకత్వ పోటీలో లిజ్ ట్రస్ కు 81,326 ఓట్లు రాగా.. రిషి సునక్ 60,399 ఓట్లు పొందారు. దాదాపుగా 20 వేల కన్నా ఎక్కువ మెజారిటీతో లిజ్ ట్రస్ గెలుపొందారు. ప్రధానితో పాటు కన్జర్వేటీవ్ పార్టీ నాయకురాలిగా లిజ్ ట్రస్ తన బాధ్యతలను నిర్వర్తించబోతున్నారు. రెండు నెలల క్రితం యూకేలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధాని బోరిస్ జాన్సన్ పై అవినీతి ఆరోపణలు రావడంతో వరసగా ఆయన మంత్రి వర్గంలోని మంత్రులు రాజీనామా చేశారు. దీంతో ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ప్రధాని ఎన్నికలు అనివార్యమయ్యాయి. మొదట్లో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ పోటీలో ముందు ఉన్నప్పటికీ.. తర్వాత లిజ్ ట్రస్ పై చేయి సాధించారు. అన్ని సర్వేలు కూడా లిజ్ ట్రస్సే యూకే కొత్త ప్రధాని అవుతారని తెలిపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here