యూకే రాజకీయ సంక్షోభంతో ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. దాదాపుగా 40కి పైగా మంత్రులు బోరిస్ జాన్సన్ మంత్రివర్గానికి రాజీనామా చేయడంతో తల వంచక తప్పలేదు. గురువారం తను ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరనేదానిపైనే అంతా ఆసక్తి నెలకొంది. భారత సంతతి వ్యక్తి రిషి సునక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తనే యూకేకు కాబోయే ప్రధాని అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే యూకేకు ప్రధాని అయిన తొలి భారతీయ సంతతి వ్యక్తిగా రిషి సునక్ రికార్డులోకెక్కుతారు.
ప్రభుత్వం నుంచి తొలుత తన మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తుల్లో రిషి సునక్ ఒకరు. ఆయన బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఎక్స్‌చెకర్ చాన్స్‌లర్ గా ఉన్నారు. 42 ఏళ్ల రిషి సునక్ ను ప్రధాని బోరిస్ జాన్సన్ ఫిబ్రవరి 2020లో ఎక్స్‌చెకర్ చాన్స్‌లర్ గా నియమించారు. దీంతో పూర్తిస్థాయి క్యాబినెట్ హోదా పొందారు. కరోనా సమయంలో కార్మికులు, వ్యాపారుల కోసం 10 బిలియన్ పౌండ్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రిషి సునక్ ‘డిషీ’గా పేరుతెచ్చుకున్నారు. కరోనా సమయంలో డౌనింగ్ స్ట్రీట్ లో జరిగిన బర్త్ డే వేడుకల్లో పాల్గొని జరిమానాను కూడా ఎదుర్కొన్నారు. రిషి తాతముత్తాతలు పంజాబ్ నుంచి బ్రిటన్ కు వలస వచ్చారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి రిషి సునక్ స్వయానా అల్లుడు. నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు కుమార్తెలు కృష్ణా సునక్, అనౌష్క సునక్ ఉన్నారు