యూకే ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ దూసుకుపోతున్నారు. ప్రధాని పదవితో పాటు కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ ఎన్నిక కోసం ఎన్నికల ప్రక్రియ మొదలైంది. బ్రిటన్ ప్రధాని అవినీతి ఆరోపణలపై రాజీనామా చేయడంతో ప్రధాని ఎంపిక అనివార్యం అయింది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిషి సునక్ అందరి కన్నా ముందున్నారు. రిషి సునక్ తో పాటు మరో భారత సంతతి వ్యక్తి సుయెల్లా బ్రేవర్‌మన్ కూడా ప్రధాని పోటీలో ఉన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే యూకేకు ప్రధాని పీఠం రిషి సునక్ ను వరించే అవకాశాలే అధికంగా ఉన్నాయి.
తాజాగా ప్రధాని పదవి కోసం జరిగిన తొలి రౌండ్లో సత్తా కనబరిచారు. అందరి కన్నా ఎక్కువగా ఎంపీల ఓట్లు సాధించారు. రిషి సునక్ కు మొత్తం 88 ఓట్లు సాధించగా.. పెన్నీ మోర్డాంట్ 67 ఓట్లు, ట్రస్ లిజ్ 50 ఓట్లు సాధించారు. మొత్తం ఎనిమిది మందిలో ప్రస్తుతం ఆరుగులు రెండో రౌండ్ లోకి వెళ్లనున్నారు. రిషి సునక్ తో పాటు సుయెల్లా బ్రేవర్‌మన్ కూడా రెండో రౌండ్ కు అర్హత సాధించారు. ఆర్థిక మంత్రి నదీమ్ జహావి, మాజీ క్యాబినెట్ మంత్రి జెరెమీ హంట్ పోటీ నుంచి తొలగించబడ్డారు.
యూకేలో ప్రధాని బోరిస్ జాన్సన్ కు వ్యతిరేకంగా మంత్రులంతా మూకుమ్మడి రాజీనామా చేయడంతో ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఛాన్సలర్ గా ఉన్న రిషిసునక్ మొదటగా రాజీనామా చేశారు. దీంతో 40కి పైగా మంది రాజీనామాలు చేశారు. దీంతో కొత్త ప్రధానిని ఎన్నుకోవడంతో పాటు కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 5 లోపు బోరిస్ జాన్సన్ వారసున్ని ఎన్నుకోవాలని అనుకుంటున్నారు.