తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని గట్టున పడేసే నాయకుడి కోసం శ్రీలంక ఎదురుచూస్తోంది. ఇవాళ శ్రీలంకలో కొత్త నాయకత్వం కొలువుదీరబోతోంది. ఇవాళ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఆ దేశ తదుపరి అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టినా అంత సులభమేమీ కాదు. గత వారం అధ్యక్షభవనంపై నిరసనకారులు దాడి చేయడంతో విదేశాలకు పారిపోయిన గొటబాయ రాజపక్సే స్థానంలో అధ్యక్షుడిని నియమించాలని శ్రీలంక పార్లమెంట్ నిర్ణయించింది. మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స స్థానాన్ని బర్తి చేసేందుకు ముగ్గురు నామినేట్ అయ్యారు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణిల్ విక్రమ సింఘే, విద్యాశాఖ మాజీ మంత్రి డల్లాస్ అలహప్పెరుమా, లెఫ్టిస్ట్ నేత అనురా దిస్సనాయకేలు పోటీ పడుతున్నట్లు పార్లమెంట్ మంగళవారం ప్రకటించింది. ఈ నేపథ్యం ఇవాళ ఎన్నిక జరగనుంది. భారీ భద్రత మధ్య మంగళవారం సమావేశమైన పార్లమెంట్‌లో చట్టసభ్యులు ముగ్గురిని నామినేట్ చేశారు.
మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశానికి కొద్ది సమయం ముందు విపక్ష నేత సాజిత్ ప్రేమదాస పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. అలహప్పెరుమాకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాత్రికి రాత్రే ఇరువురు నేతలు ఓ ఒప్పందానికి వచ్చారనే వాదనలు వినపడుతున్నాయి. ఒకరు అధ్యక్షుడు, మరొకరు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వాన్ని నడపాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షడి బాధ్యతలు నిర్వహిస్తున్న 73 ఏళ్ల విక్రమ సింఘేకు అపార అనుభవం ఉంది. ఆరుసార్లు ప్రధాని మంత్రిగా పనిచేశారు. ఎస్‌ఎల్‌పీపీ పార్టీ నాయకత్వం ఆయనకు మద్దతు ఇస్తోంది. దీంతో ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 225 సభ్యులు గల పార్లమెంట్‌లో ఎస్‌ఎల్‌పీపీనే అతిపెద్ద పార్టీగా ఉంది. అధ్యక్షుడిగా అలహాప్పెరుమాను, ప్రధానమంత్రిగా ప్రతిపక్ష నాయకుడు సాజిత్ ప్రేమదాసను ఎన్నుకోవాలని ఎస్‌ఎల్‌పీపీ మెజార్టీ సభ్యులు నిశ్చయించినట్లు పార్టీ అధ్యక్షుడు జీఎల్ పైరిస్ మంగళవారం ప్రకటించారు. మరి ఎవరు గెలుస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాగి జన బలవేగాయ (ఎస్‌జేబీ) నాయకుడు సాజిత్ తొలుత అధ్యక్ష పదవికి పోటీచేయాలనుకున్నా.. చివరకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అలహాప్పెరుమాకు మద్దతు ప్రకటించారు. ఆయన ప్రధానిగా ఎన్నికవడం దాదాపుగా లాంఛనప్రాయమేనని సమాచారం.
దేశాన్ని దివాలా తీయించిన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రజాగ్రహానికి భయపడి విదేశాలకు పారిపోవడంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. వాస్తవానికి గొటబాయ 2024 నవంబరు వరకు పదవిలో ఉండాల్సింది. కాబట్టి ఆయన స్థానంలో కొత్తగా ఎన్నికయ్యే అధ్యక్షుడు ఆ గడువు వరకు పదవిలో కొనసాగుతారు. లంక పార్లమెంటు తమ దేశాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోనుండటం గత 44 ఏళ్లలో ఇదే తొలిసారి. పార్లమెంటులో మొత్తం 225 మంది సభ్యులున్నారు. ఇందులో ఎస్‌ఎల్‌పీపీ బలం 101గా, ఎస్‌జేబీ బలం 50గా ఉంది. వామపక్ష పార్టీ జనతా విముక్తి పెరమున నాయకుడు అనురా దిస్సనాయకే కూడా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నా ఆయన గెలిచే అవకాశాలు దాదాపుగా లేనట్లుగా తెలుస్తోంది. కొత్తగా బాధ్యతులు చేపట్టే అధ్యక్షుడు 2024, నవంబర్ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.