Taylor Cohen Gets Google Job After 39 Rejections: ఎంత డ్రీమ్ జాబ్ అయినంత మాత్రాన.. ఎక్కువసార్లు రిజెక్ట్ అయితే, కచ్ఛితంగా దాన్ని పక్కనపెట్టేస్తారు. ఇక చేసిన ప్రయత్నాలు చాలు, ఏదైనా ఒక దాంట్లో సర్దుబాటు చేసుకుందామని ముందడుగు వేస్తారు. కానీ.. యూఎస్‌లోని శాన్‌ప్రాన్సిస్కోకు చెందిన టైలర్ కొహెన్ మాత్రం అలా బ్యాక్‌స్టెప్ వేయలేదు. తనకు ఉద్యోగం వచ్చేవరకూ పోరాడాడు. ఫైనల్‌గా నెగ్గాడు.
టైలర్ కొహెన్ గూగుల్‌లో ఉద్యోగం సంపాదించాలన్నదే లక్ష్యం. అందుకోసం అతడు 39 సార్లు ప్రయత్నించాడు. ఓవైపు ఇతర ఉద్యోగాలు చేస్తూనే.. మరోవైపు గూగుల్‌కు దరఖాస్తు చేస్తూ వచ్చాడు. 2019 ఆగస్టు 25వ తేదీన తొలిసారి గూగుల్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. అప్పట్నుంచి తిరస్కరణ పర్వం మొదలైతే.. ఎట్టకేలకు 2022 జులై 19వ తేదీన దానిని ఫుల్ స్టాప్ పడింది. తాను కోరుకున్న ఉద్యోగాన్ని ఫైనల్‌గా సాధించాడు కొహెన్. ఈ సందర్భంగా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా.. ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
‘‘పట్టుదలకు, పిచ్చితనానికి మధ్య ఒక గీత ఉంటుంది. ఆ రెండింటిలో నాకుంది ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చాను. 39 రిజెక్ట్ అయ్యాను. ఫైనల్‌గా గూగుల్‌లో ఉద్యోగం పొందాను’’ అంటూ పోస్టులో రాసుకొచ్చాడు. అది వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు అతనికి అభినందనలు తెలియజేశారు. పట్టు వదలకుండా ఉద్యోగం సాధించిన నువ్వు, ఎందరికో ఆదర్శం అంటూ అతడ్ని కొనియాడుతున్నారు.