12 మంది స్నేహితులను సైనైడ్ పెట్టి చంపిన మహిళ..

0
108

థాయ్ లాండ్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ ఏకంగా 12 మంది స్నేహితులను సైనైడ్ ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తులంతా 33 నుంచి 44 ఏళ్ల వయసు ఉన్న వారేనని పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2023 మధ్య ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యలకు డబ్బులే కారణమని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

ఓ హత్య విషయంలో విచారణ ప్రారంభించిన తర్వాత 32 ఏళ్ల గర్భిణి సరరత్ రంగ్‌సివుతాపోర్న్‌ను మంగళవారం బ్యాంకాక్‌లో అరెస్టు చేశారు. ఈ నెల ప్రారంభంలో ఆమె స్నేహితురాలు సిరిపోర్న్ ఖాన్వాంగ్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఏప్రిల్ 14న నిందితురాలు రంగ్‌సివుతాపోర్న్ తన స్నేహితురాలి సిరిపోర్న్ తో కలిసి రచ్చబురి ప్రావిన్స్ కు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ నది వద్ద బౌద్ధ ఆచారంలో పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో సిరిపోర్న్ కుప్పకూలి చనిపోయింది. శవపరీక్షలో ఆమె శరీరంలో సైనైడ్ గుర్తించారు, గుండె ఆగిపోవడం మరణానికి దారితీసినట్లు తేలింది. ఈ హత్య తర్వాత ఆమె ఫోన్, డబ్బు, బ్యాగులు కనిపించకుండా పోయాయి.

విచారణ సందర్భంగా మాజీ ప్రియుడితో సహా 11 మందిని రంగసివుతాపోర్న్ హత్య చేసినట్లు తాము భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. చనిపోయిన వారంతా ఇదే తరహాలో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన తర్వాత బాధితుల నగదు మాయం అయినట్లు బంధువులు ఫిర్యాదు చేశారని పోలీసులు వెల్లడించారు. మరణించిన కొన్ని నెలల తర్వాత శవాలలో సైనైడ్ ను గుర్తించవచ్చు. సైనైడ్ విషప్రయోగం తర్వాత బాధితుడిని గుండె పోటుకు గురిచేస్తుంది, మైకం, శ్వాస ఆడకపోవడం, వాంతులు లక్షణాలతో బాధితుడు మరణిస్తాడు.

ఈ హత్యలకు డబ్బు కారణమని పరిశోధకులు భావిస్తున్నారని రాయల్ థాయ్ పోలీసు అధికార ప్రతినిధి ఆర్కేయోన్ క్రైథాంగ్ తెలిపారు. అయితే నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగ్‌సివుతాపోర్న్ ఆరోపణలను ఖండించారు. ఈ హత్యలో ఆధారాలు చూపితే అనుమానితురాలిని సీరియల్ కిల్లర్ గా అభివర్ణించ వచ్చని పోలీసులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here