భూమికి ప్రమాదం తప్పదా.. అంటే పరిస్థితులు అందుకు తగ్గట్లుగానే కనిపిస్తున్నాయి. సూర్యుడి భారీ నుంచి సమస్య జీవాలను, భూమిని కాపాడే ఓజోన్ పొర నానాటికి క్షీణిస్తోంది. గతంలో అంటార్కిటికాలో గుర్తించిన ఓజోన్ రంధ్రం కన్నా 7 రెట్లు పెద్దదిగా ఉన్నట్లు కెనడాలోని వాటర్లు యూనివర్సిటీ శాస్త్రవేత్త క్వింగ్ బిన్ లూ వెల్లడించారు.
సాధారణంగా ఓజోన్ అంటే మూడు ఆక్సిజన్ అణువుల సమ్మేళనంగా (ఓ3). ఇది సూర్యుడి నుంచి వచ్చే ఆల్ట్రా వయోలెట్ కిరణాల నుంచి భూమిని, భూమిపై జీవరాశిని రక్షిస్తోంది. భూమి ఎగువ వాతావరణంలో ఒక పొరలా ఉండీ భూమిని రక్షిస్తోంది. కొన్ని కారణాల వల్ల ఈ పొరకు రంధ్రాలు ఏర్పడుతున్నాయి.
ఓజోన్ క్షీణతకు ప్రధాన కారణం క్లోరోఫ్లోరో కార్బన్స్(సిఎఫ్‌సి). కూలింగ్ యూనిట్లలో ప్రధానంగా ఈ గ్యాస్ వాడుతారు. ముఖ్యంగా ఏసీలు, ఫ్రిజ్ లలో ఈ గ్యాస్ వాడతారు. వీటి నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్స్ ఓజోన్ లేయర్ క్షీణతకు కారణం అవుతున్నాయి. ఈ క్లోరోఫ్లోరో కార్బన్ లతో ఓజోన్ గ్యాస్ రసాయనిక చర్య వల్ల ఆక్సిజన్, క్లోరిన్ వాయువులు ఏర్పడుతాయి. ఫలితంగా ఓ3 వాయవు ఆ ప్రాంతంలో ఉండదు.
ఓజోన్ పొర క్షీణత వల్ల యూవీ రేడియేషన్ పెరుగుతుంది. ఫలితంగా ఇది చర్మ క్యాన్సర్లకు, కంటిపై ప్రభావానికి కారణం అవుతుంది. దీంతో పాటు మానవుడి వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యవసాయ పంటల ఉత్పాదకతను తగ్గిస్తుంది. జలచర జీవులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.