టెక్సాస్‌లో కాల్పులు.. ఇద్దరు దుర్మరణం, నలుగురికి గాయాలు

0
218

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకులు ఇంకా పేలుతూనే ఉన్నాయి. దీన్ని నివారించడానికి బైడెన్ సర్కారు పలు చర్యలు తీసుకున్నప్పటికీ.. వరుస ఘటనలు చోటు చేసుకుంటూనే వస్తోన్నాయి. ఇదివరకు టెక్సాస్, ఓక్లహామా సహా పలుచోట్ల విచ్చలవిడిగా కాల్పులు సంభవించాయి. ప్రత్యేకించి- టెక్సాస్‌లోని ఓ ఎలిమెంటరీ స్కూల్‌లో కాల్పుల తరువాత.. తరచూ అలాంటి ఘటనలు సంభవిస్తోన్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు.

తాజాగా టెక్సాస్‌లోని హోల్టోమ్ నగరంలో శనివారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. ముగ్గురు పోలీసులతో సహా మొత్తం నలుగురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఇంట్లో ఉన్న ఓ మహిళ మృతి చెందగా.. ఆ ఇంటి బయట ఉన్న ఓ వ్యక్తి దారుణంగా కాల్చివేయబడ్డాడని అధికారులు తెలిపారు. 911కి కాల్ చేసి సమాచారం అందించిన మహిళకు కూడా బుల్లెట్ గాయాలు కాగా ప్రాణాలతో బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సాయుధుడిపై కాల్పులు జరపగా.. ముగ్గురు పోలీసులకు గాయాలైనట్లు పోలీసు అధికారి రిక్ అలెగ్జాండర్ వెల్లడించారు. సాయుధుడు నేరం చేసిన తర్వాత తనను తాను కాల్చుకున్నాడని స్థానిక పోలీసులు తెలిపారు. నిందితుడు ఘటనాస్థలానికి సమీపంలో చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ జరిపి మరిన్ని వివరాలను వెల్లడిస్తామని పోలీసు అధికారి రిక్ అలెగ్జాండర్ తెలిపారు.

ఈ ఏడాది యూఎస్ అంతటా దాదాపు 302 సార్లు కాల్పులు జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అగ్రరాజ్యంలో తుపాకీ నియంత్రణ చట్టంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవల సంతకం చేశారు. అమెరికాలో విశృంఖలమవుతున్న తుపాకీ సంస్కృతిని కట్టడి చేసేందుకు.. ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇటీవల టెక్సాస్ ఎలిమెంటరి పాఠశాలలో ఇద్దరు టీచర్లతో సహా 19 మంది విద్యార్థుల ఊచకోతతో పాటు సాముహిక కాల్పులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చట్టంపై బైడెన్‌ సంతకం చేశారు. ఈ చట్టంతో ప్రాణాలు రక్షిస్తామని.. బైడెన్‌ వైట్‌ హౌస్‌లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here