చైనా కరోనా బూచిని చూపించి విమానాలను రద్దు చేస్తే.. డ్రాగన్ కంట్రీ లాగే అమెరికా కూడా షాక్ ఇచ్చింది. అమెరికా నుంచి చైనాకు వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేసింది. చైనా, అమెరికాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇటీవల యూఎస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభం అయింది. చైనా ఎంత ఆక్షేపించినా కూడా అమెరికన్ ప్రతినిధులు తైవాన్ లో పర్యటిస్తూనే ఉన్నారు. ఇప్పటికే నెల రోజుల్లో నలుగురు అమెరికన్ రాజకీయ నాయకులు తైవాన్ లో పర్యటించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇరు దేశాలు ఒకరి విమానాలు మరొకరు రద్దు చేసుకుంటున్నారు.
కోవిడ్ 19ను బూచిగా చూపిస్తూ.. చైనా, అమెరికాకు చెందిన పలు విమానాలను రద్దు చేసింది. దీనికి ప్రతిగా అమెరికా కూడా చైనా విమానాలు రద్దు చేసింది. చైనాకు చెందిన 26 విమానాలను రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. చైనాకు చెందిన 4, అమెరికాకు చెందిన 3 విమాన సంస్థలు ఇరు దేశాల మధ్య వారానికి 20 విమానాలు నడుపుతున్నాయి. దీంతో చైనాకు చెంది జియామెన్, ఎయిర్ చైనా, చైనా సదరన్ ఎయిర్‌లైన్స్, చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ విమానాలపై ఈ ప్రభావం పడనుంది. లాస్ ఏంజెల్స్ నుంచి బయలుదేరాల్సిన 19 విమానాలు, న్యూయార్క్ నుంచి బయలుదేరాల్సిన 7 విమానాలు రద్దు అయ్యాయి.
కోవిడ్ ఆంక్షలు చూపిస్తూ చైనా, అమెరికాకు చెందిన 26 విమానాలను చైనా రద్దు చేసింది. అమెరికన్ ఎయిర్ లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్, యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాలు చైనా రద్దు చేసింది. అమెరికన్ ఎయిర్ లైన్స్ లక్ష్యంగా చైనా ఆంక్షలు విధించడంతో అమెరికా గత ఆగస్టులో ఇలాగే చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య విమానాల సంఖ్య భారీగా తగ్గింది. కోవిడ్ మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య విమానయానం దెబ్బతింది. గత జనవరిలో చైనా అమెరికాకు చెందిన 44 విమానాలను రద్దు చేస్తే.. ఇదే విధంగా అమెరికా కూడా చైనాకు చెందిన 44 విమానాలను రద్దు చేసింది.