రిషి సునాక్ ముందు ముళ్లబాట.. ప్రధానిగా పాలన అంతా ఈజీ కాదు

0
106

యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 28న బ్రిటన్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. పెన్నీ మోర్డాంట్ తప్పుకోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్న సమస్యలను రిషి సునాక్ మాత్రమే పరిష్కరిస్తారని చాలా మంది ఎంపీలు భావిస్తున్నారు. దీంతో మెజారిటీ ఎంపీలు రిషికే జై కొట్టారు. ఇదిలా ఉంటే కొత్తగా ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ కు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి.

ముఖ్యంగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ లేనంతగా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఓ రకంగా చూస్తే లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేయడం కూడా ఆర్థిక పరిస్థితే కారణం అని తెలుస్తోంది. బ్రిటన్ ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న వడ్డీ రేట్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత కొన్ని రోజులుగా అక్కడ రెండంకెల ద్రవ్యోల్భనం నమోదు అవుతోంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దీన్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు బ్రిటన్ ప్రజలు ఇంధన సంక్షోభాన్ని, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా జరిగిన సర్వే ప్రకారం బ్రిటన్ ప్రజలు ఖర్చులు తగ్గించుకునేందుక భోజనాల సంఖ్యను కూడా తగ్గించుకుంటున్నారు. రుణాల చెల్లింపుల కారణంగా బ్రిటన్ బడ్జెట్ లోటును ఎదుర్కొంటోంది. బడ్జెట్ లోటును సరిచేయడానికి అధికారం చేపట్టే రిషి సునాక్ ఖర్చుల తగ్గింపు, పన్నుల పెంపు మొదలైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి ఆర్థిక ప్రకటన అక్టోబర్ 31న విడుదల కానుంది.

ఇదిలా ఉంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై బ్రిటన్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో చూడాలి. రష్యాపై ఆంక్షలు విధించడంతో యూరప్ మొత్తం ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రానున్న శీతాకాలంలో ప్రజల సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలు యూరప్ దేశాల్లో రష్యా-ఉక్రెయిన్ మధ్య వేలు పెట్టదంటూ అక్కడి ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఫిబ్రవరి 2020, జూలై 2022 మధ్య ఆర్థిక మంత్రిగా పనిచేసిన రిషి సునక్, కోవిడ్ సమయంలో ప్రజల సంక్షేమానికి కృషి చేశారు. అయితే గతంలో లిజ్ ట్రస్ చేసిన పన్నుల తగ్గింపు చర్యను వ్యతిరేకించారు. ద్రవ్యోల్భనం నియంత్రణలోకి వచ్చిన వెంటనే పన్నులు తగ్గిస్తామని రిషి సునక్ గతంలో వెల్లడిచారు. 2029 నాటికి ఆదాయ పన్నులను 20 శాతం నుంచి 16 శాతానికి తగ్గించే తన ప్రణాళికను ఎన్నిక ప్రచారం సందర్భంగా వివరించారు. ఇదిలా ఉంటే పార్టీలోని కొంతమంది మాత్రం అధిక పన్నులను వ్యతిరేకించడం, ఆరోగ్యం, రక్షణ రంగాల్లో ఖర్చులన కోతలను వ్యతిరేకిస్తున్నారు. యూకే బ్రెగ్జిట్ నిర్ణయం కూడా ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది.

మరోవైపు భారత్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఫ్రీ-ట్రేడ్) ఒప్పందాన్ని అమలు చేసేందుకు బ్రిటన్ మొగ్గుచూపుతోంది. అయితే బోరిస్ జాన్సన్ అధికారంలో ఉన్నప్పటి నుంచి దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బ్రిటన్ ఉన్న పరిస్థితుల్లో భారత్ తో ఫ్రీ-ట్రేడ్ ఒప్పందం బయటపడేస్తుందని అక్కడి ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. 140 కోట్ల మంది ఉన్న ఇండియా మార్కెట్ ను వదులుకోవద్దని మెజారిటీ ఎంపీలు భావిస్తున్నారు. అయితే ఈ ఒప్పందంపై రిషి సునాక్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here