జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. హత్యపై దర్యాప్తు కొనసాగుతుండగా, అబేను కాల్చి చంపిన తర్వాత అదుపులోకి తీసుకున్న వ్యక్తి జపాన్ నేవీలో మూడేళ్లపాటు పనిచేసినట్లు స్థానిక మీడియా నివేదికలు వెల్లడించాయి. పశ్చిమ జపాన్‌లోని నారా సిటీకి చెందిన 41 ఏళ్ల టెట్సుయా యమగామి శుక్రవారం ప్రచార ప్రసంగంలో అబేపై కాల్పులు జరిపాడు. మొదట తన తల్లి ఆర్థికంగా నష్టపోవడానికి కారణమైన ఓ మత సంస్థకు చెందిన గురువుపై దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు యమగామి పోలీసులకు వెల్లడించినట్లు క్యోడో న్యూస్ వెల్లడించింది. ఆ మత గురువు ఎవరో అని మాత్రం తెలియరాలేదు. ఆదివారం నాటి హౌస్ ఆఫ్ కౌన్సిలర్ల (జపాన్ నేషనల్ డైట్ ఎగువ సభ) ఎన్నికలకు ముందు అబే ప్రచార ప్రసంగాలు చేసిన ఇతర ప్రదేశాలను తాను సందర్శించినట్లు యమగామి అంగీకరించినట్లు పలు వర్గాలు మీడియాకు తెలియజేశాయి.
“షింజో అబే రాజకీయ విశ్వాసాలపై ఎలాంటి పగ లేదు. కానీ, అసంతృప్తితో రగిలిపోతున్నానని, అందుకే ఆయన్ని చంపాలని నిర్ణయించుకున్నానని, అయితే ఆయనకు చికిత్స అందుతుండడంతో తాను నిరుత్సాహానికి లోనయ్యాను” అంటూ విచారణలో పోలీసుల ఎదుట సమాధానం ఇచ్చాడు. అయితే అతని అసంతృప్తికి కారణాలు ఏంటి? నిందితుడి బ్యాక్‌గ్రౌండ్ తదితర వివరాలను మాత్రం అధికారులు వెల్లడించారు. అబే హత్య తర్వాత పోలీసులు శుక్రవారం యమగామి ఇంట్లో సోదాలు చేశారు. అతడి ఇంట్లో పేలుడు పదార్థాలు, తుపాకులను గుర్తించినట్లు ఓ వార్తా సంస్థ నివేదించింది. యమగామి ప్రస్తుతం నిరుద్యోగి. అయితే, అతను దాదాపు 2020 కాన్సాయ్ ప్రాంతంలోని ఓ కంపెనీలో పనిచేసేవాడు. యమగామి గతంలో సైన్యంలో పనిచేసినట్లు జపాన్ మీడియా తెలిపింది. అతడు మారీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ మాజీ ఉద్యోగిగా పేర్కొంది. 2005 వరకు నేవీలో పనిచేశాడని వెల్లడించింది.
శనివారం ఉదయం అబే మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. రక్తస్రావంతో అబే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శవపరీక్షలో షింజో అబే ఎడమ చేయి, మెడపై రెండు తుపాకీ గాయాలు ఉన్నాయని నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. మెడపై మరో గాయం ఉందని, అయితే అది ఎలా జరిగిందో తెలియలేదని పోలీసులు తెలిపారు.