రిషి సునక్ ఓటమికి వెన్నుపోటే కారణమా..?

0
136

భారత సంతతి వ్యక్తి రిషి సునక్ యూకే ప్రధాని పదవి రేసులో ఓడిపోయారు. లిజ్ ట్రస్ చేతిలో 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోయి.. ప్రధాని పదవిని కోల్పోయారు. అంతకు ముందు యూకే ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా తరువాత యూకే ప్రధాని పదవి పోటీలో రిషి సునక్ తొలి రౌండ్లలో ముందున్నారు. అయితే తర్వాత రిషి సునక్ తన పాపులారిటీని కోల్పోయారు. అయితే రిషి సునక్ ప్రధాని పదవి దక్కకపోవడంలో ఆయన బోరిస్ జాన్సన్ కు వెన్నుపోటు పొడిచారని కన్జర్వేటివ్ టోరీ సభ్యులు ఎక్కువగా భావించడమే అని తెలుస్తుంది.

వెన్నుపోటే కారణమా..?

తన రాజకీయ గురవైన బోరిస్ జాన్సన్ కు రిషి సునక్ వెన్నుపోటు పొడిచారని.. కష్టకాలంలో అండగా నిలవలేదని మెజారిటీ టోరీ సభ్యులు భావించారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ లోపల, వెలుపల రిషి సునక్ మద్దతు కోల్పోతూ వచ్చారు. ప్రధాని పదవే లక్ష్యంగా రిషిసునక్ పనిచేశారని టోరీ సభ్యులతో పాటు ప్రజల్లో ఓ అభిప్రాయం ఏర్పడింది. రిషి సునక్ సన్నిహితుడు కన్జర్వేటివ్ నాయకుడు సాజిద్ జావిద్ కూడా లిజ్ ట్రస్ అభ్యర్థిత్వాన్ని సమర్థించడం కూడా రిషి సునక్ గెలుపు అవకాశాలను దెబ్బతీసింది.

జూలై 8న బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన కొన్ని గంటల వ్యవధిలో రిషి సునక్ పోటీలో ఉంటానని చెప్పడంతో ప్రధాని పదవే లక్ష్యంగా పనిచేస్తున్నాడని కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు భావించారు. గంటల వ్యవధిలో ‘ రెడీ ఫర్ రిషి’ పేరుతో తన ప్రచార వీడియోను అప్ లోడ్ చేశారు. తన వ్యక్తిగత ఆశయాల కోసం బోరిస్ జాన్సన్ ప్రభుత్వాన్ని పడగొట్టాడనే అపవాదు మూటకట్టుకున్నాడు రిషి సునక్. రిషి సునక్ ప్రచార వెబ్ సైట్, (రెడీఫర్ రిషి.కామ్) డిసెంబర్ 23, 2021లోనే డొమైన్ క్రియేట్ చేయడం కూడా అనుమానాలకు తావిచ్చింది. దీనికి తోడు కన్జర్వేటివ్ పార్టీలోని బోరిస్ జాన్సన్ మద్దతుదారులు రిషిసునక్ ను వ్యతిరేకించారు. వారంతా లిజ్ ట్రస్ కే మద్దతు పలికారు. దీని కోసం తెరవెనక బోరిస్ జాన్సన్ కథ నడిపించారని తెలుస్తోంది.

భార్య సంపాదన కారణమే..

రిషి సునక్ సంపన్న హోదా కూడా గెలుపు అవకాశాాలను దెబ్బతీశాయి. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ కుమార్తె అక్షతా మూర్తిని సునక్ వివాహం చేసుకున్నారు. ఆమె ఆ కంపెనీలో 0.93 శాతం వాటాను కలిగి ఉన్నారు. రిషి సునక్, ఆయన భార్య అక్షతా మూర్తి యూకే రిచ్ లిస్టులో టాప్ 250 సంపన్న వ్యక్తుల జాబితాలో ఉన్నారు. అక్షతా మూర్తి యూకేలో నివాసం లేని కారణంగా, ఆమె విదేశీ ఆదాయాలపై బ్రిటన్ లో పన్నులు చెల్లించడం లేదనేది అక్కడి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇది కూడా ఆయన గెలుపు అవకాశాాలను దెబ్బతీశాయి. ఇదిలా ఉంటే లిజ్ ట్రస్ కొత్త క్యాబినెట్ లో రిషి సునక్ కు చోటు లభించకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే లిజ్ ట్రస్ క్యాబినెట్‌లో పదవి దక్కకపోతే అది సంప్రదాయానికి విరుద్ధం అవుతుందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here