ఆమె ఒక రచయిత్రి.. ముఖ్యంగా క్రైమ్ త్రిల్లర్ కథల్ని రాస్తుంటుంది.. ఈ క్రమంలోనే ఆమె 2011లో ‘హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్’ (నీ భర్తను ఎలా చంపాలి) అనే ఓ బ్లాగు రాసింది. కట్ చేస్తే.. 2018లో తాను రాసిన ఆ కథను నిజం చేసింది. తన భర్తను అత్యంత దారుణంగా కాల్చి చంపింది. ఈ ఘటన అమెరికాలోని ఓరెగాన్‌లో చోటు చేసుకుంది. ఈ కేసులో ఆమెను ఓరెగాన్ జడ్జి జీవిత ఖైదు శిక్ష విధించారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఆ రచయిత్రి పేరు నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ (71). ఈమె భర్త పేరు డేనియల్ బ్రోఫీ. ఈయన పాకశాస్త్ర నిపుణుడిగా ఓ పాఠశాలలో విద్యార్థులకు బోధించేవాడు. ఈ బ్రోఫీ జంట భారీగా అప్పులు చేసింది. వాటినెలా తీర్చాలో తెలీక, చాలాకాలం నుంచి తర్జనభర్జన పడుతోంది. ఈ క్రమంలోనే భర్త పేరిట 1.5 మిలియన్ డాలర్ల బీమ ఉందన్న విషయం గ్రహించి, ఆ సొమ్ము కోసం భర్తని అంతమొందించాలని ప్లాన్ వేసింది. అందుకు సరైన సమయం కోసం కాపుకాచింది. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చేసింది. 2018 జూన్ నెలలో భర్త ఉద్యోగానికి వెళ్లగా, అతడ్ని నాన్సీ ఫాలో అయ్యింది. పని ప్రదేశంలోని నీటి సింక్ వద్ద డేనియల్ ఉండగా, ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడాన్ని గమనించి నాన్సీ వెనుక నుంచి తన గ్లోక్ హ్యాండ్ గన్‌తో కాల్చి చంపింది. అతడు గాయపడి కింద పడిపోగా, దగ్గర నుంచి మరోసారి గుండెల్లో కాల్చింది. దీంతో, అతడు అక్కడికక్కడే మరణించాడు.
కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. భార్య నాన్సీనే బీమా డబ్బుల కోసం భర్తను కాల్చి చంపినట్టు తేలింది. నిందితురాలు రహస్యంగా లైసెన్స్ లేని మరో తుపాకీ కిట్‌ను కూడా కొనుగోలు చేసినట్లు ప్రాసిక్యూషన్ తేల్చింది. కానీ, ఈ ఆరోపణల్ని నాన్సీ తోసిపుచ్చింది. సరికొత్త పుస్తకం కోసం పరిశోధనలో భాగంగా ఆ గన్ కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఏదేమైనా.. ఈ కేసులో దోషిగా తేలడంతో కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. కాగా.. నాన్సీ ‘ది రాంగ్ హస్బెండ్’, ‘ది రాంగ్ లవర్’ పేరిట నవలల్ని కూడా రాసింది. కానీ, వాటికి అంత ఆదరణ దక్కలేదు.