Aamir Khan Requests To Not To Boycott His Laal Singh Chaddha: రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ‘లాల్ సింగ్ చడ్డా’ను బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్లు తెగ ప్రచారం చేస్తున్నారు. గతంలో ఆమిర్ చేసిన మతపరమైన వ్యాఖ్యల్ని ఇప్పుడు మళ్లీ తెరమీదకి తీసుకొచ్చి, ఈ హీరో సినిమాని అందరూ కలిసి బాయ్‌కాయ్ చేయాల్సిందిగా ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే #BoyCottLaalSinghChaddha అనే హ్యాష్‌ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది.
ఈ విషయం తెలుసుకున్న ఆమిర్ ఖాన్.. తన సినిమాను బాయ్‌కాట్ చేయొద్దంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘నా సినిమాకు జరుగుతోన్న వ్యతిరేక ప్రచారం చూసి, చాలా బాధేస్తోంది. నాకు భారతదేశం అంటే ఇష్టం లేదని కొంతమంది భావిస్తున్న వాళ్లే ఇలా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. అలాంటి వాళ్లకు నేనొక్కటే చెప్పదలచుకున్నా.. నా దేశాన్ని నేను ఎంతో ప్రేమిస్తాను. నా గురించి వ్యతిరేక ప్రచారాలు జరగడం చాలా దురదృష్టకరం. దయచేసి నా సినిమాను బహిష్కరించకండి, థియేటర్లకు వెళ్లి చూడండి’’ అంటూ ఆమిర్ ఖాదన్ ఆవేదనతో వేడుకున్నాడు.
కాగా.. ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకొస్తోన్న ‘లాల్ సింగ చడ్డా’ సినిమాతో నాగ చైతన్య బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడు. ఇందులో అతడు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండగా.. ఆమిర్ ఖాన్ సరసన కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది. హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్ అయిన ఈ చిత్రాన్ని దర్శకుడు అద్వైత్ చంద్రన్ తెరకెక్కించాడు. గత చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ డిజాస్టర్ అవ్వడంతో, ఈ చిత్రంపై ఆమిర్ ఖాన్ చాలా ఆశలే పెట్టుకున్నాడు.