Fahadh Faasil Confirms Pushpa3: అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ‘పుష్ప 2’ సెట్స్ మీదకి వెళ్లేందుకు ఇంకా ముస్తాబవుతుండగా.. ‘పుష్ప 3’ కూడా ఉండనుందని ఫహాద్ ఫాజిల్ కన్ఫమ్ చేశాడు. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అతడు కుండబద్దలయ్యే ఈ న్యూస్‌ని రివీల్ చేశాడు. పుష్ప 2 కోసమని తాను ఇటీవల సుకుమార్‌ని కలిస్తే, పుష్ప 3 కోసం కూడా సిద్ధంగా ఉండమని సూచించారని, అందుకు కావాల్సిన మెటీరియల్ తన వద్ద ఉందని ఆ డైరెక్టర్ చెప్పినట్టు ఫహాద్ వెల్లడించాడు.
‘‘దర్శకుడు సుకుమార్ మొదట్లో నాకు పుష్ప కథ చెప్పినప్పుడు, ఒక పార్ట్‌లోనే సినిమాని కంప్లీట్ చేయాలనుకున్నారు. కానీ, పోలీస్ స్టేషన్ సన్నివేశాన్ని చిత్రీకరించాక ఈ సినిమా రెండు భాగాలుగా మారింది. ఇక రీసెంట్‌గా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, మూడో భాగానికి కూడా సిద్ధంగా ఉండమని సుకుమార్ నాతో చెప్పారు. మూడో భాగానికి కావాల్సిన మెటీరియల్ కూడా తన వద్ద ఉందని సుకుమార్ అన్నారు’’ అంటూ ఫహాద్ ఫాజిల్ చెప్పుకొచ్చాడు. ఇది బన్నీ ఫ్యాన్స్‌కే కాదు, సినీ ప్రియులకి కూడా పండగలాంటి వార్తేనని అనడంలో అతిశయోక్తి లేదు.
ఇదే సమయంలో తనకు తెలుగు డైలాగులు నేర్చుకునేందుకు బన్నీ సహా సుకుమార్ చాలా సపోర్ట్ చేస్తున్నారని, తనకు సమయం కూడా ఎక్కువగా ఇస్తున్నారని పేర్కొన్నాడు. పుష్ప షూటింగ్ సమయంలో తాను చాలా కంఫర్టబుల్‌గానే ఉండేవాడినని ఫహాద్ వెల్లడించాడు. మరోవైపు.. పుష్ప-2 సినిమాలో బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్పేయి ఓ కీలక పాత్రలో నటించనున్నాడని సమాచారం. ఈమధ్య సీక్వెల్స్, మల్టీవర్స్‌ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలోనే సుకుమార్ ఇలా మూడో భాగానికి తెరలేపినట్టు తెలుస్తోంది.