ఆస్కార్స్‌లో నాటు నాటు పాట.. కోట్లలో బెట్టింగులు

0
69

ఏదైనా ఒక సందర్భం వచ్చిందంటే చాలు.. బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగ్ వేసేందుకు రెడీగా ఉంటారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాట ఆస్కార్స్‌కి నామినేట్ అయిన నేపథ్యంలో.. తమ బెట్టింగ్ దందాని షురూ చేశారు. లాస్ ఏంజెల్స్‌లో మార్చి 12వ తేదీన రాత్రి గంటలకు (భారత కాలమానం ప్రకారం మార్చి 13న ఉదయం 5:30 గంటలకు) ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరగనుంది. దీంతో.. ఏ హీరో ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకుంటాడు? ఏ సినిమాకి ఆస్కార్ వస్తుంది? అనే అంశాపై జోరుగా బెట్టింగ్స్ సాగిస్తున్నారు.

మరీ ముఖ్యంగా.. ఆర్ఆర్ఆర్ సినిమాపై కోట్ల రూపాయల్లో బెట్టింగ్స్ జరుగుతోందని సమాచారం. హైదరాబాద్‌, ముంబై వంటి నగరాల్లో బుకీలు తిష్టవేసి.. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌కు నామినేట్‌ అయిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ వస్తుందా? లేదా? అంటూ బెట్టింగ్‌ వేస్తున్నారు. అయితే.. ఈ బెట్టింగ్ వ్యవహారమంతా ఆన్‌లైన్‌లోనే నడిపిస్తున్నట్టు తేలింది. 1:4 నిష్పత్తితో ఈ బెట్టింగ్ నడుస్తోందని.. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని తెలుస్తోంది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. కేవలం సామాన్యులే కాదండోయ్, పలువురు నిర్మాతలతో పాటు టెక్నీషియన్స్ కూడా ఈ బెట్టింగ్స్‌లో పాల్గొంటున్నట్టు వార్తలొస్తున్నాయి. తొలిసారి ఒక తెలుగు సినిమా ఆస్కార్ బరిలో నిలిచిన నేపథ్యంలో.. గతంలో మునుపెన్నడూ లేని స్థాయిలో బెట్టింగ్స్ వ్యవహారం సాగుతోందని సమాచారం.

ఇదిలావుండగా.. ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్న ‘నాటు నాటు’ పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్‌తో పాటు మరెన్నో పురస్కారాల్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆస్కార్స్‌కి నామినేట్ అవ్వడంతో.. ఈ పాటకి అవార్డ్ దక్కాలని అందరూ కోరుకుంటున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కూడా ఈ పాటకి అవార్డ్ దక్కాలని ట్విటర్ మాధ్యమంగా కోరాడు. ఈ పాటకి ఆస్కార్ వస్తే.. భారతదేశ ఖ్యాతి పెరుగుతుందని, మన కల్చర్ గురించి ప్రపంచానికి తెలుస్తోందని పేర్కొన్నాడు. మరి, ఆస్కార్ అవార్డ్‌ని ఈ పాట సొంతం చేసుకుంటుందా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here