Hyderabad Builder Booked For Harassing Telugu Actress: అతడో బిల్డర్.. పైగా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆ సాన్నిహిత్యంతో ఓ నటి అతనికి అప్పు ఇచ్చింది. నెలల్లోనే తిరిగిస్తాడనుకుంటే, సంవత్సరాలు గడిచిపోయాయి. దీంతో.. తన డబ్బు తిరిగివ్వమని ఒత్తిడి చేస్తే, సహజీవనం చేయమంటూ అతడు షాకిచ్చాడు. అసభ్యకరమైన మెసేజ్‌లతో టార్చర్ పెట్టాడు. అతని వేధింపులు భరించలేక, ఆ నటి చివరికి పోలీసుల్ని ఆశ్రయించడంతో కటకటాల పాలయ్యాడు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆ నటి (42) సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తూ తన కెరీర్ కొనసాగిస్తోంది. హైదరాబాద్‌లోని అమీర్‌పేట నాగార్జున నగర్ కాలనీలో ఉంటోన్న ఈమెకు.. పదిహేనేళ్ల ప్రవీణ్ అనే బిల్డర్ పరిచయం అయ్యాడు. అప్పట్నుంచి సాన్నిహిత్యం పెరగడంతో.. ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యాడు. కట్ చేస్తే.. ఎనిమిదేళ్ల క్రితం ప్రవీణ్ ఆమె వద్ద నుంచి రూ. 47 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. వెంటనే తిరిగిస్తానని మాటిచ్చాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ కదా అని నమ్మి, అపార్ట్‌మెంట్‌లో ఉండే మరో మహిళ వద్ద నుంచి డబ్బులు తీసుకొని మరీ అతనికి అప్పు ఇచ్చింది.
సంవత్సరాలు గడిచినా డబ్బులివ్వకపోవడంతో.. కొన్ని రోజుల క్రితం డబ్బులు తిరిగివ్వాలని ఆ నటి ఒత్తిడి చేసింది. దాంతో పగ పెంచుకున్న ప్రవీణ్.. అసభ్యకరమైన మెసేజ్‌లు చేయడం మొదలుపెట్టాడు. తనతో సహజీవనం చేయమని ఒత్తిడి తెచ్చాడు. అతని ప్రవర్తనతో ఖంగుతిన్న ఆ నటి.. పరిస్థితి చెయ్యి దాటకముందే పోలీసుల్ని ఆశ్రయించింది. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రవీణ్‌ని అదుపులోకి తీసుకున్నారు.