తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషీయుమ్’ సినిమాను తెలుగులో భీమ్లా నాయక్ పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే! పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ రీమేక్.. మంచి విజయం సాధించడమే కాదు, ఒరిజినల్ కంటే చాలా బాగుందని ప్రశంసలు అందుకుంది. మలయాళ మూలం దెబ్బతినకుండా.. సాగర్ కే చంద్రతో కలిసి త్రివిక్రమ్ కథలో మంచి మార్పులు చేశాడని, చాలా చక్కగా తీర్చిదిద్దారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ చిత్రాన్ని ఒక బలమైన మల్టీస్టారర్ గా చెప్పుకున్నారు కూడా! ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు.
ఇంతకీ హీరో ఎవరో తెలుసా? రీసెంట్ గా దక్షిణాది సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసి, భాషా పరిశ్రమల మధ్య వివాదానికి తెరలేపిన జాన్ అబ్రహం. తాను రీజనల్ సినిమాలు చేయనని, బాలీవుడ్ లో మాత్రమే పని చేస్తానని చెప్పిన ఇతగాడు.. ఇప్పుడు మలయాళ సినిమాను రీమేక్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. అటు మలయాళంలో, ఇటు తెలుగులో మంచి రిజల్ట్ రావడం చూసి.. ‘అయ్యప్పనుమ్ కోషీయుమ్’ రీమేక్ హక్కుల్ని జాన్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల్ని అనురాగ్ కశ్యప్ కి అప్పగించాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుందని సమాచారం. అయితే, ఇందులో మరో హీరో పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయంపైనే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
తాను చేసిన ప్రయోగాలన్నీ బెడిసికొడుతున్న నేపథ్యంలో.. ఈ రీమేక్ చేసేందుకు జాన్ అబ్రహం పూనుకున్నాడు తెలుస్తోంది. ఇతని చివరి చిత్రం ‘ఎటాక్’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది. హాలీవుడ్ లెవెల్లో సినిమా తీయాలని ప్రయత్నించి, ఆయన బోల్తా కొట్టేశాడు. గ్రాఫిక్స్ దగ్గర నుంచి సబ్జెక్ట్ దాకా.. ఏదీ బాగోలేదని విమర్శలు వచ్చాయి. దీంతో, ప్రయోగాల జోలికి వెళ్తే తన కెరీర్ పూర్తిగా ప్రమాదంలో పడొచ్చన్న భయంతో, సేఫ్ గేమ్ లో భాగంగా రీమేక్ బాట పట్టినట్టు అర్థమవుతోంది.