Kalyan Ram Talks About Political Entry: నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ రోల్‌లో నటించిన ‘బింబిసార’ సినిమా ఆగస్టు 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కళ్యాణ్ వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే ఇతనికి పొలిటికల్ ఎంట్రీపై ఓ ప్రశ్న ఎదురైంది. ఇందుకు అతను గతంలో కంటే భిన్నంగా సమాధానమిచ్చాడు. ‘‘మనం ఒకేసారి రెండు పడవల్లో ప్రయాణం చేయలేం. ప్రస్తుతానికి నా దృష్టంతా సినిమాల మీదే ఉంది. ఒకవేళ నేను పాలిటిక్స్‌లోకి వస్తే, అప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్తా’’ అని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.
ఇండస్ట్రీలో హీరోగా తనదైన ఓ సుస్థిర స్థానం ఏర్పరుచుకునేందుకు కళ్యాణ్ రామ్ చాలాకాలం నుంచి ప్రయత్నిస్తున్నాడు. ‘పటాస్’ తర్వాత అతనికి మళ్లీ ఆ స్థాయి హిట్ దక్కలేదు. ప్రయోగాత్మక చిత్రాలతో అలరించాలని ప్రయత్నించాడు కానీ, అవి బెడిసికొట్టాయి. ఇప్పుడు తనకెంతో ఇష్టమైన హిస్టారికల్ జోనర్‌లో ‘బింబిసార’ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. సబ్జెక్ట్‌పై ఉన్న నమ్మకంతో, భారీ బడ్జెట్ వెచ్చించి మరీ ఈ సినిమాని నిర్మించాడు. ఫ్లాపుల్లో ఉన్న ఈ సినిమా గట్టెక్కిస్తుందని చాలా నమ్మకంగా ఉన్నాడు. దీని తర్వాత మరెన్నో ప్రాజెక్టులకు ప్రణాళికలు రచించుకున్నాడు. ఆ లెక్కన, కళ్యాణ్ రామ్ ఇప్పుడప్పుడే పాలిటిక్స్‌లో అడుగుపెట్టడం అసాధ్యమే!