మంచి క్రేజ్, గుర్తింపు వచ్చిన తర్వాత నటీనటుల కెరీర్ సాఫీగా సాగిపోతుందనుకుంటే.. పప్పులో కాలేసినట్టే! ఎందుకంటే, ప్రతీ సినిమా వాళ్లకు ఒక ఛాలెంజే! ప్రతీ దశలోనూ వారికి అనూహ్యమైన సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. ఇప్పుడు తనకూ అలాంటి ఇబ్బందే ఎదురైనట్టు కృతిశెట్టి చెప్పింది. ఉప్పెనతో బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చాక ఎనలేని క్రేజ్, ఇమేజ్ పొందిన ఈ భామ.. ‘ద వారియర్’ సినిమాలో రామ్ సరసన కథానాయికగా నటించింది. ఈనెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న తరుణంలో.. చిత్రీకరణ సమయంలో దర్శకుడి వల్ల తాను ఎదుర్కొన్న ఓ సమస్య గురించి చెప్పుకొచ్చింది.
‘‘నా మాతృభాష తుళు. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత తెలుగు భాష నేర్చుకున్నాను. ఇప్పటివరకూ నేను పని చేసింది కూడా తెలుగు దర్శకులతోనే. కానీ, తొలిసారి ఓ తమిళ దర్శకుడితో పని చేశాను. నాకు తమిళం రాదు. లింగుస్వామి తెలుగులో తమిళ యాస ఉంటుంది. దీంతో భాష పరంగా వారం రోజుల పాటు చాలా ఇబ్బంది పడ్డా. ఆయన ఏం చెప్పేవారో నాకు సరిగ్గా అర్థమయ్యేది కాదు. అనంతరం రామ్‌కి తమిళం బాగా వచ్చన్న సంగతి తెలిసి.. ఆయన సహకారం తీసుకున్నాను. లింగుస్వామి ఏం చెప్పేవారు.. రామ్ నాకు అర్థమయ్యేలా చెప్పేవారు. ఆ తర్వాత మెల్లగా నాకు అలవాటు అయిపోయింది’’ అని కృతి వెల్లడించింది.
ఇక ద వారియర్ సినిమాలో తాను రేడియో జాకీగా కనిపిస్తానని, తన పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని, కచ్ఛితంగా ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని కృతి శెట్టి ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా.. పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి, వాటిని అందుకుంటుందో లేదో రిలీజ్ వరకూ వేచి చూడాలి.