Latest Telugu Cinema Titles: ముఖం అనేది మన మనసును సూచిస్తుందంటారు. అలాగే.. భిన్నమైన పేర్లు, ఆకట్టుకునే టైటిళ్లు తమ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడతాయని తెలుగు ఫిల్మ్ డైరెక్టర్లు, నిర్మాతలు భావిస్తున్నట్లున్నారు. రీసెంట్‌గా వస్తున్న పిక్చర్లను బట్టి ఈ ట్రెండ్ అర్థమవుతోంది. ఉదాహరణకు ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. ఇదొక కొత్త సినిమా పేరు. సెప్టెంబర్ 2న విడుదల కానుంది. వాస్తవానికి చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ తదితర పెద్ద హీరోల చిత్రాలు రిలీజ్ కావటమే ఆలస్యం ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఎంతో మంది అభిమానులు కోరుకుంటారు. అందువల్ల ఈ (‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే) పదం బాగా పాపులర్ అయింది. దీంతో.. దీన్నే ఓ సినిమాకు టైటిల్‌గా పెట్టాలనే ఆలోచన రావటం కాస్త క్రియేటివిటీ అనే చెప్పొచ్చు.
మరో మూవీ నామం ‘రంగరంగ వైభవంగా’. నిజానికి ఇది ‘అంగరంగ వైభవంగా’ అనే ఒక ప్రజాదరణ పొందిన పదాన్ని గుర్తుచేస్తోంది. అందులోని ఒకే ఒక అక్షరాన్ని మార్చి దీన్నొక టైటిల్‌గా తీసుకొచ్చారు. జనానికి తొందరగా కనెక్ట్ కావాలన్నా, వాళ్ల నోళ్లల్లో నానాలన్నా, నలుగురి మధ్య చర్చల్లో నిలవాలన్నా ఇలాంటి చిన్న చిన్న పద ప్రయోగాలు చేయటం మెచ్చుకుదోగ్గ విషయమే. ‘ఉప్పెన’ ఫేం వైష్ణవ్ తేజ్ ఇందులో హీరో కావటం మరో విశేషం. ఆకాశ వీధుల్లో అనే పేరుతో ఇంకో పిక్చర్‌లో గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ కలిసి చేశారు. సెప్టెంబర్ 2న రిలీజ్‌కి రెడీ అయింది. ‘ఒకే ఒక జీవితం’ అనేది ఇంకో సినిమా పేరు. ఇందులో శర్వానంద్, రీతు వర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.
అమర సైనికులు, వలస కార్మికుల కుటుంబాలకు కేసీఆర్ సాయం
ఈ టైటిల్.. రియాలిటీకి చాలా దగ్గరగా, సూసైడ్ చేసుకోవాలనుకునేవారిని, ర్యాష్ డ్రైవింగ్ తదితర విచ్చలవిడి అలవాట్లకు పాల్పడేవారిని పునరాలోచనలో పడేసేలా అర్థవంతంగా ఉంది. ‘అవును.. మనకు ఉన్నది ఒకే ఒక జీవితం కదా?. దీన్ని ఎందుకు చేజార్చుకోవాలి’ అని అనుకునేలా చేస్తోంది. సినిమాకి ఈ పేరు పెట్టినవాళ్లను శెభాస్ అనాలనుంది. ‘గుర్తుందా శీతాకాలం’.. ఇది మరో వెరైటీ టైటిల్. సహజంగా.. ఆ సంఘటన గుర్తుందా?, ఫలానా వ్యక్తి గుర్తున్నాడా అని అడుగుతుంటారు. కానీ ఇలా ‘గుర్తుందా శీతాకాలం’ అని అడగటం ‘చిత్రం’గానే ఉంది. సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. సత్యదేవ్, తమన్నా హీరోహీరోయిన్లుగా జంట కట్టడం గమనార్హం.
మాతృదేవోభవ అనే పేరుతో గతంలో ఒక సినిమా వచ్చి బాగా ఆడింది. ఇప్పటికీ ఆ మూవీని ప్రేక్షకులు మర్చిపోలేదు. సెంట్‌మెంట్‌తో ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించారు. తాజాగా అదే టైటిల్‌తో మూవీ వస్తోంది. ‘ఓ అమ్మ కథ’ అనేది దీనికి సబ్ టైటిల్. సీనియర్ యాక్టర్లు సుమన్, సుధ ప్రధాన తారాగణం. ఇది కూడా సెప్టెంబర్‌లోనే థియేటర్లలోకి రానుంది. ‘కొత్త కొత్తగా’ అనే పేరుతో మరో మూవీ తెరకెక్కుతోంది. టైటిలే ‘కొత్త కొత్తగా’ ఉండటం ప్రస్తావనార్హం. కోబ్రా అనే టైటిల్‌తో ఓ చిత్రం ఇవాళే విడుదలైంది. కోబ్రా అంటే నాగుపాము అని, పడగ విప్పగలిగే పాము అని అర్థం. జంతువుల పేరును సినిమాలకు పెట్టడం కొత్తకాదు. అయినా అదే ఫార్ములాను మళ్లీ ఫాలో అయ్యారు. కొందరికి అదొక అలవాటు.
తిరు అనే రెండక్షరాలతో ఇంకో చిత్రం రూపొందింది. కెప్టెన్ అనే టైటిల్‌తో తెరకెక్కిన చిత్రం సెప్టెంబర్ 8న రిలీజ్‌కు సిద్ధమైంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ అద్భుతంగా జీవించిన పుష్ప అనే రీసెంట్ సూపర్ డూపర్ పాన్ ఇండియా ఫిల్మ్‌ని తలపించేలా ఓ కొత్త సినిమాకు పుష్పరాజ్ అనే పేరు పెట్టారు. పుష్పకి రాజ్‌ని యాడ్ చేశారు. అంతే. టైటిల్ కోసం పెద్దగా శ్రమ పడలేదు. మరికొందరు దర్శక నిర్మాతలేమో ‘బుజ్జీ.. ఇలా రా’, ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’.. ఇలా డిఫెరెంట్ టైటిల్స్ ట్రై చేస్తున్నారు. ఈ చిత్రాల్లో కథ, కథనం, పాటలు, మాటలు, నటనలు, నవరసాలూ పండేలా ఉంటాయో లేదో తెలియదు గానీ పేర్లు మాత్రం ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. టైటిల్‌కి తగ్గట్లే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవాలని సినిమా అభిమానులు ఆశిస్తున్నారు.