గోపీచంద్, రాశీఖన్నా జంటగా నటించిన ‘పక్కా కమర్షియల్’ మూవీ జూలై 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం నాడు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. గోపీచంద్‌తో తనకు చాలా దగ్గర సంబంధం ఉందని తెలిపారు. గోపీచంద్ తండ్రి టి.కృష్ణ స్టూడెంట్‌గా ఉన్న సమయంలో ఒంగోలులో కలిశారని.. ఆయన బీఏ చదువుతుండగా తాను ఇంటర్ చదువుకున్నానని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నామని.. కానీ ఆయన దర్శకుడు, తాను హీరోలం అయ్యామని పేర్కొన్నారు.
టి.కృష్ణ మంచి సినిమాలను తెరకెక్కించారని.. కానీ ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు రాలేదని మెగాస్టార్ అన్నారు. ఆయన తనయుడు గోపీచంద్ మంచి యాక్టర్ అని చిరు ప్రశంసించారు. గోపీచంద్ నటించిన సినిమాల్లో సాహసం, ఒక్కడున్నాడు వంటి సినిమాలు తనకు చాలా ఇష్టమన్నారు. దర్శకుడు మారుతితో ప్రజారాజ్యం పార్టీ ఫ్లాగ్ డిజైన్ దగ్గర నుంచే మంచి అనుబంధం ఉందని నాటి రోజులను చిరంజీవి గుర్తుచేసుకున్నారు. మారుతి ఇప్పుడు దర్శకుడిగా రాణిస్తుండటం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. మారుతి దర్శకత్వంలో తాను ఓ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని.. అందుకు సంబంధించిన వ్యవహారాలు యూవీ క్రియేషన్స్ విక్కీతో మాట్లాడాలని చిరు అన్నారు. కాగా పక్కా కమర్షియల్ సినిమాను జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.