ఇటీవల కళాతపస్వి కే విశ్వనాథ్ పరమపదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి రోజా ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి.. భార్య, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం విశ్వనాథ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. విశ్వనాథ్‌పై ప్రశంసలు కురిపించారు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని.. తెలుగు సినిమాల ద్వారా ఆయన సాహిత్యానికి, కల్చర్‌కు చేసిన సేవ ఇంకెవరూ చేయలేరేమో అనిపిస్తుందని అన్నారు. ఆయన లేరని ఊహించుకోవడమే కష్టంగా ఉందన్నారు. తన సినిమాల్లో తెలుగుదనం, తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా చేశారు.
ఒక దర్శకుడిగా, ఒక నటుడిగా విశ్వనాథ్ ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించారని రోజా తెలిపారు. ‘‘తెర మీద ఆయన కనిపించరు కానీ ఆయన పద్ధతులు కనిపిస్తాయి, క్రమశిక్షణ కనిపిస్తుంది, ఒక టీచర్‌ను చూసినట్టు భయం వేస్తుంది. నిజంగా ఆయన జీవితం పరిపూర్ణంగా అనుభవించారు’’ అని తెలిపారు. విశ్వనాథ్ ఆత్మకు శాంతి కలగాలని అందరూ కోరుకోవాలని రోజా కోరారు. తెలుగు నెల ఉన్నంత వరకు.. తెలుగు వారంతా అభిమానించే విశ్వనాథ్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆయన తెలుగు సినిమాకు చేసిన సేవను గుర్తించి.. ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి సత్కరించిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.