ఇప్పుడు భారత చిత్రసీమలో రూపొందుతోన్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో RC15 ఒకటి. రామ్ చరణ్, శంకర్ కాంబోలో ఈ సినిమా రూపొందుతోంది. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో.. ఆయా చిత్రసీమల్లోని ప్రముఖ నటీనటుల్ని రంగంలోకి దింపుతున్నారు. ఆల్రెడీ జయరాం, ఎస్‌జే సూర్యను ఈ సినిమాలో తీసుకున్నారు. ఇప్పుడు మరో మలయాళ స్టార్‌ని సెలెక్ట్ చేసినట్టు సమాచారం. అతను మరెవ్వరో కాదు.. మోహన్ లాల్. ఈ సినిమా ద్వితీయార్థంలో ఆయన ఎంట్రీ ఉంటుందని.. దర్శకుడు శంకర్ చాలా డిఫరెంట్‌గా, పవర్‌ఫుల్‌గా ఆ పాత్రని డిజైన్ చేశాడని అంటున్నారు.
ఈ పాత్ర కోసం తొలుత కొందరిని పరిశీలించారని, చివరికి మోహన్ లాల్‌ని సరిగ్గా సూటవుతారని తెలిసి ఆయన్ను ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పాత్రకి గాను ఆయనకు భారీ పారితోషికమే ముట్టిందని చెప్తున్నారు. అయితే.. ఈ వార్తలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాగా.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో కిరాయా అద్వాణీ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీకాంత్, సునీల్, అంజలి, తదితర నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
నిజానికి.. ఇటీవల శంకర్ ‘ఇండియన్ 2’ షూటింగ్‌ని తిరిగి ప్రారంభించడంతో, RC15 షూటింగ్ ఆలస్యం అవుతుందేమోనని అనుమానాలు రేకెత్తాయి. అయితే.. అలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, తాను ఏకకాలంలో ఈ రెండు సినిమాల షూటింగ్స్ నిర్వహిస్తున్నానని, ముందుగా చెప్పిన సమయానికే RC15 సినిమాను విడుదల చేస్తామని శంకర్ క్లారిటీ ఇచ్చాడు.