ఆమధ్య బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ చేసిన నగ్న ఫోటోషూట్ ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే! ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడమే ఆలస్యం.. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. దేశంలో మరే సమస్య లేనట్టుగా.. ఆ ఫోటోల మీదే చర్చలు జరిగాయి. డిబేట్ల మీద డిబేట్లు పెట్టేశారు. కొందరు ఇతనికి మద్దతుగా దిగొచ్చి, నగ్న ఫోటోలు షేర్ చేశారు. కానీ, రణ్‌వీర్ సింగ్ ఫోటోషూట్‌పై అభ్యంతరాలు ఎక్కువగా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ముంబై పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళల మనోభావాలు దెబ్బతీసేలా రణ్‌వీర్ ఫోటోషూట్ ఉందని మహిళ సంఘాలు చేసిన ఫిర్యాదు మేరకు.. ఐపీసీలోని 509, 292, 294 సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని 67ఏ కింద కేసు బుక్ చేశారు.
ఈ క్రమంలోనే కేసు విచారణకు రణ్‌వీర్ సింగ్ ఇటీవల హాజరయ్యాడు. ఈ విచారణలో భాగంగా.. తనకు చెందిన ఫోటోల్లో ఒక ఫోటోని ఎవరో ట్యాంపర్ చేసి, మార్ఫింగ్ చేశారని పేర్కొన్నాడు. తాను షేర్ చేసిన ఏడు ఫోటోల్లో ఒక ఫోటో మాత్రం లేదని తెలిపాడు. ఈ సందర్భంగా తాను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలను పోలీసులకు అందించాడు. ఇదిలావుండగా.. రణ్‌వీర్ ఇచ్చిన ఈ వాంగ్మూలంపై సోషల్ మీడియాలో నెటిజన్లు వినూత్నంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ‘‘ఎవరో రణ్‌వీర్ సింగ్ అకౌంట్‌ని హ్యాక్ చేసి, అతడి ఫోటోలను మార్ఫ్ చేసి, పోస్ట్ చేసినట్టున్నారు’’ అంటూ నెటిజన్లు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు.