Samantha About Divorce In Coffee With Karan Show: నాగచైతన్యతో విడాకుల విషయంపై ఎప్పుడూ మీడియా ముందుకొచ్చి మాట్లాడని సమంత.. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత కాఫీ విత్ కరణ్ షోలో పెదవి విప్పింది. తమ మధ్య సరైన అనుబంధం లేకపోవడం వల్లే విడిపోయామంటూ సిసలైన కారణాన్ని రివీల్ చేసింది. ఇప్పటికీ తమ మధ్య సఖ్యత లేదంటూ బాంబ్ పేల్చింది. అంతేకాదండోయ్.. ఓ సందర్భంలో కరణ్ జోహర్ నోరు జారి ‘భర్త’ అనగానే, శివంగిలా ఆగ్రహంతో ‘భర్త కాదు.. మాజీ భర్త’ అంటూ బదులిచ్చింది. భరణం వార్తలపై ఛలోక్తులు పేల్చింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
‘‘మా విడాకులు అంత సులభంగా జరగలేదు. విడిపోతున్న సమయంలో నేను మనోవేదనకు గురయ్యా. ఇప్పుడు ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోవడమే కాదు.. మరింత దృఢంగా తయారయ్యా. మా మధ్య సఖ్యత లేకపోవడమే విడాకులకి కారణం. ఒకవేళ మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే.. అక్కడ పదునైన ఆయుధాలు లేకుండా చూసుకోవాలి. విడాకులు తీసుకున్నాక నాపై ఎంతో నెగెటివ్ ప్రచారం వచ్చింది. అప్పుడు వాటిపై స్పందించేందుకు నా వద్ద సమాధానాలు లేవు’’ అని సమంత తెలిపింది. ఇక భరణం వార్తలపై మాట్లాడుతూ.. ‘‘విడాకులు తీసుకున్నాక రూ. 250 కోట్లు భరణం తీసుకున్నానని వచ్చిన వార్తలు చూసి ఖంగుతిన్నా. అప్పుడు ఐటీ అధికారులు ఇంటిపై దాడి చేసి, ఆ వార్తలు అవాస్తమని చెప్తే బాగుండేదని ప్రతిరోజూ ఎదురుచూశా’’ అంటూ సరదాగా చెప్పింది.