హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 13 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మండీ జిల్లాలో గోహార్ హబ్ డివిజన్‌లోని జాదోన్ గ్రామంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన్ ఖేమ్ సింగ్ అనే వ్యక్తి రెండంతస్తుల ఇంటిపై శనివారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ ఇంటిలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. ఘటనా సమయంలో ఖేమ్ సింగ్ కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. . ఇక జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడడం వల్ల రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అనేక గ్రామాల్లోని ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడం వల్ల వాహనాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. అనేక గ్రామాల ప్రజలు వరుణుడి ప్రతాపానికి నానా పాట్లు పడుతున్నారని చెప్పారు.
భారీ వర్షాల కారణంగా చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో చౌరీ తహసీల్‌లోని బానెట్ గ్రామంలో కొండ చరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఎడతెరిపి లేని వర్షాల ధాటికి కాంగ్రా జిల్లాలోని పురాతన రైల్వే వంతెన కూలిపోయింది. మండీ జిల్లాలో ఆకస్మిక వరదల కారణంలో ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం రాత్రి మండి-కటోలా-ప్రషార్ రోడ్డులోని బాఘి నుల్లాలోని ఆమె ఇంటికి అర కి.మీ దూరంలో బాలిక మృతదేహం లభించగా.. ఆమె కుటుంబంలోని ఐదుగురు కొట్టుకుపోయారని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. కాంగ్రాలో ఇల్లు కూలి తొమ్మిదేళ్ల చిన్నారి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ జిల్లాలో జరిగిన మరో సంఘటనలో, లాహర్ గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో బాల్ ముకుంద్ అనే 48 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు వారు తెలిపారు.
రాష్ట్రంలోని హమీర్‌పూర్ జిల్లాలో వరదల కారణంగా చిక్కుకుపోయిన 22 మందిని సురక్షితంగా తరలించినట్లు అధికారులు తెలిపారు. మృతులకు ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని పాఠశాలలకు ఈరోజు సెలవు ఉంటుందని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి తెలిపారు.
ఆకస్మిక వరద కారణంగా కాంగ్రా లోయ చక్కి నది రైలు వంతెనకు చెందిన రెండు స్తంభాలు కూడా కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. వివిధ చోట్ల కొండచరియలు విరిగిపడటంతో పఠాన్‌కోట్-మండి జాతీయ రహదారిని మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఆగస్టు 25 వరకు భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో కాంగ్రా, చంబా, మండి, కులు, సిమ్లా, సిర్మౌర్, సోలన్, హమీర్‌పూర్, ఉనా, బిలాస్‌పూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ సుదేష్ కుమార్ మోఖ్తా తెలిపారు. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, క్లౌడ్‌బర్స్ట్‌లు, రాక్‌స్లైడ్‌లు, నదులలో నీటి మట్టం ఆకస్మికంగా పెరగడం, అవసరమైన సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని మిస్టర్ మోఖ్తా జిల్లా అత్యవసర కార్యకలాపాల కేంద్రాలను కోరారు.
ఆగస్టు 28 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పర్యాటకులు, ప్రజలు నదులు, ప్రవాహాల దగ్గరకు వెళ్లవద్దని కాంగ్రా జిల్లా యంత్రాంగం సూచించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితి తలెత్తినా స్పందించాలని కాంగ్రా డిప్యూటీ కమినషర్ నిపున్ జిందాల్ కోరారు. పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను ఇప్పటికే ఆదేశించినట్లు జిందాల్ తెలిపారు.