ఢిల్లీలోని అలీపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న గోదాము గోడ కూలి 5గురు కూలీలు మృతి చెందగా.. 9 మంది గాయపడిన విషాద ఘటన దేశ రాజధానిలోని అలీపూర్‌లో జరిగింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరి కొంతమంది చిక్కుకున్నట్లు సమాచారం. వారిని రక్షించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘటనా సమయంలో అక్కడ దాదాపు 20 నుంచి 25 మంది కూలీలు పనిచేస్తున్నట్లు సమాచారం.
గోదామును అక్కడ అక్రమంగా నిర్మిస్తున్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన పనులు ఆపలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఐదుగురు మరణించారని, తొమ్మిది మంది గాయపడ్డారని, ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉందని.. ఘటనా స్థలం నుండి శిథిలాలు తొలగిస్తున్నామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.