Rath Yatra: రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. బుధవారం త్రిపురలోని ఉనకోటి జిల్లాలో ఇనుముతో చేసిన రథంపై విద్యుత్ తీగలు తెగి పడిపోవడంతో దాదాపు 6 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉనకోటిలోని చౌముహాని ప్రాంతంలో ఊరేగింపు జరుగుతుండగా, రథంపై విద్యుత్ వైర్ పడింది. ఆ సమయంలో రథంపై దాదాపు 20 మంది ఎక్కారు. విద్యుదాఘాతంతో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
రథానికి కూడా మంటలు అంటుకోవడంతో కొంత మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. క్షతగాత్రులను కుమార్‌ఘాట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఉనకోటి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆరుగురి మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపించాయి.