కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెళగావికి సమీపంలోని ఓ గ్రామం వద్ద గూడ్స్ వాహనాం కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ప్రమాదంలో మొత్తం 9 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
పూర్తి వివరాల్లోకి వెళితే..గోకాక్ తాలుకాలోని అక్కాంతంగియార హాల గ్రామానికి చెందిన కార్మికులు బెళగావికి వెళ్తుండగా బెళగావి సమీపంలోని కనబరగి గ్రామం వద్ద గూడ్స్ వాహనం బళ్లారి నాలాలో పడిపోయింది. ప్రమాదానికి గురైన వారు భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడిక్కడే ఏడుగురు మరణించగా.. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎనిమిది మంది గాయపడగా అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
ఘటన జరిగిన వెంటనే బెళగావి పోలీస్ కమిషనర్ ఎంబీ బోరలింగయ్య ఆధ్వర్యంలో పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి సీఎం బసవరాజ్ బొమ్మై రూ 5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. దీంతో పాటు బెళగావి డిప్యూటీ కమిషనర్ నుంచి మరో రూ. 2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదంపై సీఎం బసవరాజ్ బొమ్మై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ఆయన వెల్లడించారు.