పాఠశాలకు కత్తితో వెళ్లి ఓ వ్యక్తి హల్‌చల్.. టీచర్‌ను చంపేస్తానంటూ..

0
245

కనీసం ఒంటిపై చొక్కా లేకుండా తన పిల్లలు చదువుకునే పాఠశాలకు వెళ్లి ఓ వ్యక్తి కత్తితో హల్‌చల్ చేశాడు. ఉపాధ్యాయుడిని బెదిరిస్తూ రెచ్చిపోయాడు. బిహార్‌లోని అరారియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జోకిహాట్ పీఎస్ పరిధిలోని భగవాన్‌పూర్ పంచాయతీకి చెందిన అక్బర్ అనే వ్యక్తి తన పిల్లలు చదివే పాఠశాల సమీపంలోనే నివసిస్తుంటాడు. ఇటీవల తన పిల్లల చదువుతున్న పాఠశాలకు ఒంటిపై చొక్కా లేకుండా కత్తి పట్టుకుని వెళ్లాడు. తన పిల్లలకు రావాల్సిన స్కూల్ యూనిఫాం, పుస్తకాలు అందలేదని.. వాటికి బదులుగా డబ్బులు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుడిని బెదిరించాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని హెచ్చరించాడు. 24 గంటల్లో డబ్బులు ఇవ్వకుంటే మళ్లీ వస్తానని ఉపాధ్యాయులను బెదిరించాడు. చివరికి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఈ ఘ‌ట‌న‌పై పాఠ‌శాల ప్రధానోపాధ్యాయుడు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసి వివ‌రాలు తెలిపారు. అతడు పదే పదే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతుంటాడని పోలీసులుకు వెల్లడించారు. పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కత్తి పట్టుకున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారులు చదువుకునే చోటుకు బట్టలు వేసుకోకుండా.. కత్తితో రావడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here