అగ్నిపథ్ స్కీమ్ భవిష్యత్ జవాన్ల పాలిట పెద్ద మోసం అని విమర్శించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. నాలుగేళ్ల తరువాత పెన్షన్ లేకుండా పదవీ విరమణ చేసే వ్యక్తులకు కనీసం పెళ్లిళ్లు కూడా కావని ఆయన అన్నారు. నాలుగేళ్ల కాలపరిమితి కోసం జవాన్లను తీసుకునే ‘ అగ్నిపథ్ స్కీమ్’ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
జవాన్లకు ఆరు నెలులు శిక్షణ, ఆరు నెలల సెలవు అంటుందని.. మూడు ఏళ్ల ఉద్యోగం తరువాత, వాళ్లు ఇంటికి వెళ్లినప్పుడు పెళ్లి ప్రతిపాదనలు కూడా రావని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ బాగ్ పత్ కు వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలను చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా గతంలో నేను మాట్లాడానని.. ఇప్పుడు యువత సమస్యల గురించి మాట్లాడుతా అని అన్నారు. గవర్నర్ గా పదవీ విరమణ చేసిన తర్వాత తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని సత్యపాల్ మాలిక్ అన్నారు. రైతులు, జవాన్ల కోసం అవసరమైన చోటల్లా పోరాడతానని ఆయన వెల్లడించారు. త్వరలోనే కాశ్మీర్ పై పుస్తకం రాస్తానని వెల్లడించారు.
గతంలో కూడా సత్యపాల్ మాలిక్ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని ఇరుకున పెట్టే విధంగా పలు సమస్యలపై బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రైతు ఉద్యమం సమయంలో, రైతులు చనిపోయినప్పుడు ప్రభుత్వాన్ని సూటిగా నిందించారు. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలను రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.