పండగ సీజన్ ముందు సామాన్యులకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థ అమూల్. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్, అమూల్ బ్రాండు పేరుతో దేశవ్యాప్తంగా పాలను విక్రయిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ లీటర్ పాల ధరను రూ.2 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ ధర లీటర్ కు రూ. 61 నుంచి 63కు పెరగనుంది. ఇది సామాన్యుల బడ్జెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించనుంది.
గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లో కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ ధర, గేదె పాల ధరలను లీటర్ కు రూ.2 పెంచుతున్నట్లు ఆ సంస్థ ఎండీ ఆర్ఎస్ సోధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగబోతున్న గుజరాత్ లో మాత్రం ధరలను పెంచలేదు. దేశంలో మిగతా రాష్ట్రాల్లో పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి. డెయిరీ ఫ్యాట్ ధరల్లో డిమాండ్ పెరగడంతో పాల ధరలను పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. మదర్ డైరీ కూడా పాల సేకరణ ఖర్చుల పెరుగుదలను భర్తీ చేసేందుకు ధరలను పెంచింది.
దీనికి ముందు ఈ ఏడాది మార్చిలో కూడా పాలధరలను పెంచారు. అయితే అమూల్ సంస్థ ఆగస్టులో అమూల్ గోల్డ్, శక్తి పాల బ్రాండ్ల ధరలను లీటర్ కు రూ. 2 పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా రెండు నెలల తర్వాత మరోసారి పాల ధరలను పెంచింది. మరోవైపు ఇటీవల లంపీ స్కీన్ వైరస్ వ్యాధి వల్ల గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో 45 శాతానికి పైగా పాల ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో ఉత్పత్తి, పంపిణీలో తేడాలు వచ్చాయి. ఈ రాష్ట్రాలతో పాటు మొత్తం దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో లంపీ స్కిన్ వ్యాధి ప్రభావాన్ని చూపించింది. ఇప్పటి వరకు ఈ వ్యాధి వల్ల భారతదేశంలో లక్షకు పైగా పశువులు మరణించాయి.